Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆస్ట్రేలియా ప్రభుత్వంపై టెన్సిస్ దిగ్గజం జొకోవిచ్ సంచలన విజయం

సిడ్నీ: కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా విదేశీ ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అసాధారణ ఎదురుదెబ్బ తగిలింది. తన వీసాను రద్దు చేసి, నిర్బంధించడాన్ని సవాలు చేసిన జొకోవిచ్‌కు సోమవారం అత్యవసర ఆన్‌లైన్ కోర్టులో అనుకూల తీర్పు వచ్చింది.


అతడి వీసాను పునరుద్ధరించి, నిర్బంధం నుంచి తక్షణం విడిచిపెట్టాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం మరోలా వాదిస్తున్నారు. జొకోవిచ్ విజయం సాధించినప్పటికీ ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ తన ‘వ్యక్తిగత రద్దు అధికారాన్ని’’ ఉపయోగించుకోవచ్చని ఆయన కోర్టుకు తెలిపారు.  


34 ఏళ్ల సెర్బియన్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు గత వారం మెల్‌బోర్న్ చేరుకున్నాడు. ఇందులో గెలిస్తే 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడిగా జొకోవిచ్ రికార్డులకెక్కేవాడు. మెల్‌బోర్న్‌లోని తుల్లామెరైన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన జొకోవిచ్‌కు చాంపియన్ స్వాగతం లభించాల్సి ఉండగా వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంతో విమానాశ్రయంలో నిలిపివేశారు. అంతేకాక, అతడి వీసాను రద్దు చేసి ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ ఫెసిలీటికి తరలించారు. 


సోమవారం ఈ కేసును విచారించిన ఎమర్జెన్సీ ఆన్‌లైన్ కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. జొకోవిచ్ వీసా రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. అలాగే, జొకోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.


అంతేకాదు, తన ఆదేశాల తర్వాత అరగంటలోపే అతడిని విడుదల చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జొకోవిచ్ వీసాను రద్దు చేసిన తర్వాత గతంలో పార్క్ హోటల్ అయిన ఐదంతస్తుల భవనానికి తరలించి నిర్బంధించారు. ఆస్ట్రేలియాలోని కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా దేశంలో చిక్కుకుపోయిన మరో 32 మంది కూడా అక్కడే ఉన్నారు. కొందరైతే దాదాపు ఏడాదిగా అక్కడే నిర్బంధంలో ఉన్నారు. 

Advertisement
Advertisement