జొకో మరోసారి

ABN , First Publish Date - 2021-07-10T07:49:16+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి వింబుల్డన్‌ తుది పోరుకు చేరాడు.

జొకో మరోసారి

వింబుల్డన్‌ ఫైనల్‌కు టాప్‌సీడ్‌

బెరెటినితో తుదిపోరు

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి వింబుల్డన్‌ తుది పోరుకు చేరాడు. శుక్రవారం సెంటర్‌ కోర్టులో జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ జొకో 7-6 (7-3), 7-5, 7-5 స్కోరుతో 10వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఏడోసీడ్‌ మాటియో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. జొకోకిది ఏడో వింబుల్డన్‌ ఫైనల్‌. కాగా.. మొదటి సెమీ్‌సలో బెరెటిని 6-3, 6-0, 6-7 (3), 6-4తో 14వ సీడ్‌ హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలెండ్‌)ను ఓడించాడు.


45 ఏళ్ల తర్వాత..

తొలి సెమీ్‌సలో హర్కాజ్‌ను ఓడించిన 25 ఏళ్ల బెరెటిని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే 45 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరిన ఇటలీ ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. చివరిసారి 1976లో అడ్రియానో పనాటా ఫ్రెంచ్‌ ఓపెన్‌ తుదిపోరుకు చేరడమేకాదు టైటిల్‌ కూడా దక్కించుకున్నాడు. ఇక మాటియోకిది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కూడా కావడం విశేషం. మరోవైపు స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌, రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ వంటి మేటి ఆటగాళ్లను కంగుతినిపించి జెయింట్‌ కిల్లర్‌గా ప్రశంసలందుకున్న హర్కాజ్‌ సెమీ్‌సలో అదేస్థాయిలో రాణించలేకపోయాడు. మొదటి రెండు సెట్లలో తేలిపోయిన 24 ఏళ్ల హర్కాజ్‌ మూడోసెట్లో బెరెటినికి గట్టిపోటీ ఇచ్చాడు. దాంతో ఆ సెట్‌ టై బ్రేక్‌కు మళ్లడంతో హర్కాజ్‌ పోరాడి మరో సంచలన విజయం సాధిస్తాడనిపించింది. కానీ నాలుగో సెట్లో అంతగా ప్రభావం చూపని హ్యూబర్ట్‌..సెట్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. రెండు గంటల 36 నిమిషాల మ్యాచ్‌లో  బెరెటిని ఏకంగా 22 ఏస్‌లు సంధించగా హర్కాజ్‌ ఐదింటితో సెరిపెట్టుకున్నాడు.

ఇద్దరు చెరో డబుల్‌ఫాల్ట్‌లు చేయగా..బెరెటిని 60 విన్నర్లు, హర్కాజ్‌ 27 కొట్టారు. మాటియో 18 అనవసర తప్పిదాలు చేయగా..హ్యూబర్ట్‌ 26 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. ‘ఏం మాట్లాడాలో తెలియడంలేదు. నా టెన్నిస్‌ కెరీర్‌లో ఇదో గొప్ప రోజు. ఇక్కడ ఫైనల్‌ ఆడతానని కలలో కూడా అనుకోలేదు’ అని మ్యాచ్‌ అనంతరం బెరెటిని అన్నాడు. ఇక ఆదివారం ఇటలీ వాసులకు ‘గ్రేట్‌ సండే’ కానుంది. బెరెటిని వింబుల్డన్‌ ఫైనల్లో తలపడనుండగా..అదేరోజు లండన్‌ వెంబ్లీ స్టేడియంలో జరిగే యూరో కప్‌ టైటిల్‌ ఫైట్‌లో ఇంగ్లండ్‌తో ఇటలీ అమీతుమీ తేల్చుకోనుంది.


వింబుల్డన్‌ మహిళల ఫైనల్‌ నేడు

 ప్లిస్కోవా గీ బార్టీ (స్టార్‌స్పోర్ట్స్‌లో)

సాయంత్రం 6.30 నుంచి

Updated Date - 2021-07-10T07:49:16+05:30 IST