ఇప్పుడొక మైలురాయి

ABN , First Publish Date - 2020-11-30T08:41:41+05:30 IST

ముక్కలు ముక్కలుగా చెబుతూ వుంటా ఒక్కొక్క ముక్క అవయవాన్ని తీసేసినట్టు...

ఇప్పుడొక మైలురాయి

ముక్కలు ముక్కలుగా చెబుతూ వుంటా

ఒక్కొక్క ముక్క ఒక్కొక్క అవయవాన్ని తీసేసినట్టు

సర్వసమగ్రమైన జీవితం

ఏకభాగం కాక- కళ్ల ముందే ముక్కలైపోవటం

పద్యంలో చరణాల్లాంటి ముక్కలు

విఠలాచార్య సినిమాలో, మనిషి గాల్లో ఆడినట్టు

కళ్ల ముందు ఆడుతుంటాయి

రాజ్యమూ జీవితమూ ముక్కల సర్వస్వమైనట్టు

ఏ పేజీకాపేజీ చదివినట్టు

ఏ ముక్కకాముక్క చదువుకోవాల్సిందే

ఘటనలమయమైన జీవితంలో

ఏ ఘటనకాఘటన అవిభాజ్యమైన భాగమే

అతి ముఖ్యమైన పదమే

పిల్లాడొకడు బుర్రలబండి దొర్లించుకుంటూ పోతుంటాడు

అరుగు మీద కూర్చున్న ముసలాయన మదిలో

ఒక ప్రాణతీగ మోగుతుంది.

పెదిమ మీద చిరునవ్వు మొలుస్తుంది

ఎక్కడ నుంచి ఎక్కడదాక దొర్లించుకుపోయినా

కోత కోసేటప్పుడు తెగిన వేలు- అలానే.

అన్నింటినీ సమీకరించాలని ఒక ముద్ద చేయాలని

కాని సాధ్యం కాదు

కాలు నుంచి విడిపోయిన ముక్క, మరో పరిపూర్తి పాదమౌతుందా

బహు దూరాలు నడిచిన పాదం-

ఇప్పుడొక మైలురాయి.

గత నడకల లావణ్యాన్ని లాఘవాన్ని

స్మరించుకోవటం తప్ప-

అది నాలోని భాగమే

అలా విడిపోయి స్వతంత్రత ప్రకటించుకుంటుంది

ముక్కలు ముక్కలుగా చెబుతూ వుంటా

రాసుకో- అదొక పద్యమౌతుంది

(దేవిప్రియ మదిలో మెదలగా)

కె శివారెడ్డి

9502167764


Updated Date - 2020-11-30T08:41:41+05:30 IST