మొండి.. కొండెక్కున్‌!

ABN , First Publish Date - 2020-07-01T06:18:38+05:30 IST

కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా దేశీయ బ్యాంకింగ్‌ రంగ పునరుద్ధరణకు కొన్నేళ్లు పట్టవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది...

మొండి.. కొండెక్కున్‌!

  • 2020-21లో 14శాతానికి ఎన్‌పీఏలు 


  • కరోనాతో బ్యాంకింగ్‌పై దీర్ఘకాలిక ప్రభావం
  • రికవరీకి కొన్నేళ్లు: ఎస్‌ అండ్‌ పీ  

ముంబై: కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా దేశీయ బ్యాంకింగ్‌ రంగ పునరుద్ధరణకు కొన్నేళ్లు పట్టవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. లాక్‌డౌన్‌లో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు బ్యాంకింగ్‌పై తీవ్ర, దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయని తాజా నివేదికలో పేర్కొంది. ఈ పరిణామం బ్యాంకుల రుణ వితరణకు అవరోధమని, తత్ఫలితంగా దేశ ఆర్థిక పురోగతిపై ప్రభావం పడనుందని ఎస్‌ అండ్‌ పీ అభిప్రాయపడింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. కరోనా దెబ్బకు బ్యాంకింగ్‌ రంగంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) సరికొత్త ఆల్‌టైం గరిష్ఠానికి పెరగవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరినాటికి అవి 13-14 శాతానికి పెరగవచ్చని అంచనా. 2018 మార్చి నాటికి 11.6 శాతం వద్ద ప్రస్తుత ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న స్థూల ఎన్‌పీఏలు.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) ముగిసేసరికి 8.5 శాతానికి దిగివచ్చాయి. మళ్లీ మొండి బకాయిల పెరుగుదల బ్యాంకులపై రుణ వ్యయాన్ని పెంచుతుంది. రేటింగ్‌పైనా ప్రభావం చూపుతుంది. 
  2. అనూహ్యంగా పెరగనున్న మొండిబకాయిల సమస్య పరిష్కారం మాత్రం నెమ్మదిగానే జరగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో గ్రాస్‌ ఎన్‌పీఏలు మహా అయితే ఒక శాతం వరకు తగ్గవచ్చు.  
  3. కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన రంగాలకు రుణాల పునర్‌వ్యవస్థీకరణ అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంకులు మొండి బకాయిల గుర్తింపును కొంతకాలం వాయిదా వేయగలవు. అంతే తప్ప, ఎన్‌పీఏల సమస్య కు పరిష్కారం కాదు. గతంలోనూ బ్యాంకులు రుణాలను భారీ స్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించాయి. దాంతో మొండి పద్దుల వాస్తవిక పరిస్థితిపై స్పష్టత కోసం ఆర్‌బీఐ మళ్లీ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించాల్సి వచ్చింది. 
  4. బ్యాంకులతో పోలిస్తే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎ్‌ఫసీ)పై అధిక ప్రభావం పడనుంది. బలహీన వర్గాలకు రుణాలివ్వడం, టోకు ఫండింగ్‌పై ఆధారపడాల్సి రావడం, ద్రవ్య సమస్యలు ఇందుకు కారణం కానున్నాయి. 
  5. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ)కు రూ.40,000 కోట్ల మేర మూలధన సాయం అవసరం పడవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం పీఎ్‌సబీలకు కేటాయించిన దాని కంటే ఇది అధికం. 

Updated Date - 2020-07-01T06:18:38+05:30 IST