India కోసం Americaలోని NRI డాక్టర్ల సరికొత్త కార్యక్రమం.. ఒక్కొక్కరికీ ఒక్కో గ్రామం.. 75తో మొదలు.. 7 లక్షల గ్రామాలే లక్ష్యం..

ABN , First Publish Date - 2021-09-05T02:28:25+05:30 IST

ఎంత ఎత్తుకు ఎదిగినా మన కాళ్లు నేలమీదే ఉండాలంటారు. అలాగే మాతృభూమిని వదిలి ఎంతదూరం వెళ్లినా.. దానిమీద మమకారం మాత్రం వదులుకోకూడదు. ఈ మాటను కచ్చితంగా పాటిస్తున్నారు ఈ ఎన్నారై డాక్టర్లు. పుట్టిన నేలకు సాయం చేసేందుకు..

India కోసం Americaలోని NRI డాక్టర్ల సరికొత్త కార్యక్రమం.. ఒక్కొక్కరికీ ఒక్కో గ్రామం.. 75తో మొదలు.. 7 లక్షల గ్రామాలే లక్ష్యం..

వాషింగ్టన్: ఎంత ఎత్తుకు ఎదిగినా మన కాళ్లు నేలమీదే ఉండాలంటారు. అలాగే మాతృభూమిని వదిలి ఎంతదూరం వెళ్లినా.. దానిమీద మమకారం మాత్రం వదులుకోకూడదు. ఈ మాటను కచ్చితంగా పాటిస్తున్నారు ఈ ఎన్నారై డాక్టర్లు. పుట్టిన నేలకు సాయం చేసేందుకు కంకణం కట్టుకున్న ఈ డాక్టర్లు ఒక్కొక్కరూ ఒక్కో గ్రామం దత్తత తీసుకుని అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఒరిజిన్(ఏఏపీఐ)లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన డాక్టర్లంతా కలిసి ప్రత్యేకంగా ‘అడాప్ట్ ఏ విలేజ్(ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం)’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతవారం జరిగిన ఓ ఆన్‌లైన్ సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.


భారతదేశంలో దాదాపు 7 లక్షల గ్రామాలున్నాయి. అలాగే భారత దేశ జనాభాలో 77 శాతం పేదలు గ్రామాల్లోనే నివశిస్తున్నారు. అందులో అధికశాతం ప్రజలకు కనీసం సరైన తాగునీటి వసతి, మరుగుదొడ్ల వసతులు లేవు. ఈ క్రమంలోనే ఏఏపీఐలోని భారత సంతతి డాక్టర్లంతా కలిసి అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏఏపీఐ చైర్మన్ సతీశ్ మాట్లాడుతూ.. ఒక్కో దఫా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని.. అక్కడి ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పనిచేయడం ద్వారా ఆయా గ్రామాల్లో ఎంతో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు.


ఏఏపీఐ ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ గోటిముక్కల మాట్లాడుతూ.. అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం కోసం ఎంతో శ్రమిస్తున్నామన్నారు. దీనికోసం గ్లోబల్ టెలిక్లినిక్స్‌తో కలిసి ఏఏపీఐ పనిచేయనుందని చెప్పారు. ‘భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా మొదట 75 గ్రామాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ గ్రామాలు ఉండే అవకాశం ఉంది. ఈ గ్రామాల్లో ప్రధానంగా వైద్య సదుపాయాల కల్పనపై దృష్టి సారించడం జరుగుతుంది. అనేక వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ఫలితాలను పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటైంది. ఆ బృందం తదుపరి చర్యలను సూచిస్తుంది’ అని డాక్టర్ అనుపమ తెలిపారు. అయితే 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆజాదీగా అమృతోత్సవ్ నేపథ్యంతో తమ వంతుగా అందిస్తున్న చిన్న సహకారమే తమ అడాప్ట్ ఏ విలేజ్ అని డాక్టర్ అనుపమ గొట్టిముక్కల వెల్లడించారు.


అడాప్ట్ ఏ విలేజ్‌ ప్రారంభ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో అమెరికాలోని వివిధ నగరాలలోని భారత దౌత్య కార్యాలయాల ప్రతినిథులు పాల్గొన్నారు. చికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, అట్లాంటా రాష్ట్రాల భారత రాయబార కార్యాలయ ప్రతినిథులు, శాన్‌ఫ్రాన్సిస్కో రాయబార కార్యాలయ డిప్యూటీ జనరల్‌లు ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు. ఈ సమావేశంలో భారత్‌కు చెందిన అమెరికా దేశ రాయబారి తరంజిత్ సింగ్ సంధు పాల్గొని ఏఏపీఐ నిర్ణయాన్ని ప్రశంసించారు. కోవిడ్ వంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఏఏపీఐలోని భారత డాక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయమని అభినందించారు.

Updated Date - 2021-09-05T02:28:25+05:30 IST