కాణిపాకం ఆలయానికి ఎన్నారై భారీ విరాళం !

ABN , First Publish Date - 2020-10-29T20:10:18+05:30 IST

ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయకుడి ఆలయానికి ఓ ఎన్నారై బుధవారం భారీ విరాళం అందించారు.

కాణిపాకం ఆలయానికి ఎన్నారై భారీ విరాళం !

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయకుడి ఆలయానికి ఓ ఎన్నారై బుధవారం భారీ విరాళం అందించారు. ప్రవాస భారతీయుడు ఏకంగా లక్ష అమెరికన్ డాలర్లు(రూ.72.88 లక్షలు) విరాళంగా ఇచ్చినట్టు ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశులు వెల్లడించారు. దాత కోరిక మేరకు వీటిలో 50వేల డాలర్లు అన్నదానం ట్రస్టు ఖాతాలో, మరో 50 వేల డాలర్లను గోసంరక్షణ ట్రస్టు ఖాతాలో జమచేసినట్లు ఈఓ పేర్కొన్నారు. దాతకు తన వ్యాపారంలో భారీ లాభాలు రావడంతో ఈ భూరీ విరాళం ఇచ్చారని తెలియజేశారు. కాగా, ఆలయం చరిత్రలోనే ఇంతా భారీ మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ కూడా ఇంత మొత్తంలో విరాళం అందించిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు.   


కరోనా సంక్షోభం వల్ల ఆలయ ఆదాయం పూర్తిగా పడిపోయిన సమయంలో ఎన్నారై ఇచ్చిన ఈ విరాళం ఎంతో సహాయంగా ఉంటుందని ఈఓ పేర్కొన్నారు. ఈ క్లిష్టపరిస్థితుల దృష్ట్యా మరికొందరు దాతలు ముందుకు వచ్చి ఆలయానికి విరాళాలు అందిస్తే తాము నిర్వహిస్తున్న అన్నదానం, గోసంరక్షణ వంటి స్వచ్ఛంద కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయని ఈ సందర్భంగా ఈఓ వెంకటేశులు అన్నారు. కాగా, రూ. 73 లక్షలు విరాళంగా ఇచ్చిన దాత తన పేరును మాత్రం గోప్యంగా ఉంచాలని కోరినట్టు తెలిపారు.

Updated Date - 2020-10-29T20:10:18+05:30 IST