ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతిపై ఎన్నో అనుమానాలు

ABN , First Publish Date - 2021-04-16T13:31:22+05:30 IST

నగర శివారు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గురువారం తెల్లవారుజామున నలుగురు సభ్యులు కలిగిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుం బం అంతబట్టని రీతిలో మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. సుంకరి బాంగారునాయుడు (50) రెండు దశాబ్దాలు బహ్రెయిన్‌లో పనిచేసి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా విశాఖపట్నం వచ్చేశారు.

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతిపై ఎన్నో అనుమానాలు

ముగ్గురి మృతదేహాలపై కత్తి పోట్లు

పెద్ద కుమారుడు దాడి చేసి ఉంటాడని పోలీసుల అనుమానం

ఫ్లాట్‌లో రెండు కత్తులు స్వాధీనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నగర శివారు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గురువారం తెల్లవారుజామున నలుగురు సభ్యులు కలిగిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుం బం అంతబట్టని రీతిలో మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. సుంకరి బాంగారునాయుడు (50) రెండు దశాబ్దాలు బహ్రెయిన్‌లో పనిచేసి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా విశాఖపట్నం వచ్చేశారు. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని ఆదిత్య ఫార్చూన్‌ హిల్స్‌లోని సి-505 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా గంట్యాడ. ఆయన భార్య నిర్మల (50). హోమియో వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్‌ (22) వరంగల్‌ నిట్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. కరోనాకు ముందు ఢిల్లీలో ఉండేవాడు.  తరు వాత ఇక్కడికి వచ్చేశాడు. చిన్న కుమారుడు కశ్యప్‌ (19) ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. వీరు నలుగురూ ఫ్లాట్‌లో చనిపోయి ఉన్నారు.


సి-505లో రెండు కత్తులు స్వాధీనం

ఫ్లాట్‌ తలుపులు విరగ్గొట్టి లోపలి దృశ్యాలు చూసిన పోలీసులకు అక్కడ మరణాలు సహజంగా, ప్రమాదవశాత్తూ జరిగినట్టుగా అనిపించలేదు. రక్తపు మరకలు...శరీరాలపై కత్తిపోట్లు, ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పడి వుండ డం అనుమానాలకు అవకాశం ఇచ్చింది. అక్కడి శవాలు పూర్తిగా దహనం కాలేదు. అంటే ఆ స్థాయిలో మంటలు చెలరేగలేదు. బంగారునాయుడు దేహంపై దుస్తులు లేవు. ఆయన ఒక్కరే ఎక్కువ శాతం కాలారు. భార్య నిర్మల, చిన్న కుమారుడు కశ్యప్‌ దేహాలు పెద్దగా కాలిన ఆనవాళ్లు లేవు. వారు కత్తిపోట్లు, గాయాలతోనే చనిపోయి వుంటారని భావించారు. షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు రేగాయనడానికి ఆస్కారం కనిపించలేదు. లిఫ్ట్‌, ఇతర విద్యుత్‌ పరికరాలు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఆ దిశగానే దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించారు. బంగారు నాయుడు వుంటున్న ఫ్లాట్‌లో పోలీసులు రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 


ముందు పొడిచేసి, ఆపై వైన్‌ పోసి కాల్చారని...

కుటుంబ సభ్యుల మధ్య ఏ విషయంలోనో గొడవ జరిగింది. రాత్రి రెండు గంటల వరకు కేకలు వేసుకున్నా రు.ఆ తరువాత కొంతసేపటికి పొగలు వచ్చాయి. అంటే.. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య పెద్దకుమారుడు దీపక్‌ మిగిలిన ముగ్గురిపై దాడి చేసి చంపేసి వుంటాడని అనుమానం వ్యక్తమవుతోంది. ఆ తరువాత వారిని కాల్చేయడానికి యత్నించి, అందుకు ఏమీ దొరక్క...అందుబాటులో వున్న వైన్‌సీసాల్లో వైన్‌ని ఉపయోగించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ వైన్‌కు పెద్దగా మంటలు రాకపోవడం, పొగ ఎక్కువ రావడంతో ఫ్లాట్‌లో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. దీపక్‌ ఊపిరాడకే చనిపోయాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే మిగిలిన వారికి కూడా ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు.


ఎందుకు సూట్‌ వేసుకున్నాడో...

తండ్రి ఎలాంటి దుస్తులు వేసుకున్నారో తెలియదు...శరీరం కాలిపోయింది. తల్లి నిర్మల నైటీ, తమ్ముడు కశ్యప్‌ దుస్తులతోనే ఉన్నారు. దీపక్‌ మాత్రం మెడకు టై కట్టుకొని, సూట్‌ మాదిరి బ్లేజర్‌ వేసుకున్నాడు. అంటే బయటకు పారిపోయేందుకు అలా తయారయ్యాడా? అని యోచిస్తున్నారు. 


మానసికవ్యాధి ఉందేమోనని..?

దీపక్‌కు మానసిక వ్యాధి ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులను, తమ్ము డిని అంత కిరాతకంగా పొడిచి చంపేయడానికి కారణాలు ఏమై ఉంటాయా? అని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్‌ బహ్రెయిన్‌లో వున్నప్పుడు గుర్తింపు కోరుకునే వాడని ఆయన ఫేస్‌బుక్‌ చూస్తే తెలుస్తుంది. దుబాయ్‌ షేక్‌ మాదిరిగా డ్రెస్‌ వేసుకొని, అక్కడి పోలీస్‌ బైక్‌ ఎక్కి దిగిన ఫొటోలు అతడి మానసిక స్థితిని బయటపెడుతున్నాయి. దీనిపైనా విచారణ జరుగుతోంది.


Updated Date - 2021-04-16T13:31:22+05:30 IST