భర్త ఫ్యామిలీ ద్వారా కెనడాలో సెటిల్ అయిన భార్య.. ఆ తర్వాత చేసిన నిర్వాకమిదీ..

ABN , First Publish Date - 2021-09-01T21:39:00+05:30 IST

కెనడాలో ఉండే ఓ ఎన్నారై మహిళ నిర్వాకమిదీ. భర్త ఫ్యామిలీ ద్వారా కెనడాలో సెటిల్ అయిన ఆమె.. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి అతని మరణానికి కారణమైంది.

భర్త ఫ్యామిలీ ద్వారా కెనడాలో సెటిల్ అయిన భార్య.. ఆ తర్వాత చేసిన నిర్వాకమిదీ..

బర్నాలా: కెనడాలో ఉండే ఓ ఎన్నారై మహిళ నిర్వాకమిదీ. భర్త ఫ్యామిలీ ద్వారా కెనడాలో సెటిల్ అయిన ఆమె.. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి అతని మరణానికి కారణమైంది. బింత్ కౌర్ అనే మహిళ కట్టుకున్న భర్తను ఇలా అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. దీంతో మృతుడు లవ్‌ప్రీత్‌ కుటుంబ సభ్యులు తాజాగా బర్నాలా పోలీసులకు ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం బర్నాలాలోని ఖుది కలాన్ గ్రామానికి చెందిన బింత్ కౌర్‌తో ధనౌలా వాసి లవ్‌ప్రీత్‌కు 2019, ఆగస్టు 7న వివాహమైంది. అయితే, ఈ పెళ్లికి ముందే బింత్ కౌర్‌ను కెనడాలో చదివించేందుకు లవ్‌ప్రీత్ తండ్రి బల్వీందర్ ఏకంగా రూ. 24 లక్షలు ఖర్చు చేశాడు. 


వారి సాయంతో 2018, ఆగస్టు 19న ఆమె ఓ కంప్యూటర్ కోర్సు చేయడానికి కెనడా వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు అయిన ఖర్చు మొత్తం లవ్‌ప్రీత్‌ కుటుంబమే భరించింది. ఆ తర్వాత 2019, ఆగస్టు 5న లవ్‌ప్రీత్‌‌తో పెళ్లి కోసం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చింది. రెండు రోజుల తర్వాత వీరికి ఇరువురు కుటుంబ సభ్యులు ఘనంగా వివాహం జరిపించారు. పది రోజుల పాటు ఆమె లవ్‌ప్రీత్‌‌తోనే ఉంది. అనంతరం ఆగస్టు 17న తిరిగి కెనడాకు వెళ్లిపోయింది. త్వరలోనే లవ్‌ప్రీత్‌ను కూడా కెనడాకు తీసుకెళ్తానని చెప్పిన బింత్.. ఆ తర్వాత భర్తను దూరం పెట్టడం మొదలెట్టింది. కనీసం భర్త ఫోన్ చేసిన మాట్లాడేది కాదు. దాంతో భార్య తనను మోసం చేసిందని లవ్‌ప్రీత్ ఈ ఏడాది జూన్ 23న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతికి కారణమైన బింత్‌పై లవ్‌ప్రీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట బర్నాలా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 


రెండు నెలల తర్వాత తాజాగా లవ్‌ప్రీత్ తండ్రి బల్వీందర్ మరోసారి పోలీసులను ఆశ్రయించి బింత్ కౌర్ వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. మొదట తమ ఆర్థిక సాయంతో కెనడాలో సెటిల్ అయిన బింత్.. ఆ తర్వాత తన కుమారుడిని పెళ్లి చేసుకుని ఘోరంగా మోసం చేసిందని తన ఫిర్యాదు పేర్కొన్నారు. భర్తను ఇక్కడే వదిలేసి.. అతనిని మానసికంగా కృంగిపోయేలా చేయడంతో పాటు ఆత్మహత్యకు కారణమైందని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు బింత్‌పై లవ్‌ప్రీత్‌ను బలవన్మరణానికి ప్రోత్సహించినందుకు మరో కేసు నమోదు చేసినట్లు బర్నాలా డీఎస్‌పీ విశ్వదీప్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీఎస్‌పీ తెలియజేశారు.         

Updated Date - 2021-09-01T21:39:00+05:30 IST