ప్రవాసులను అలరించిన ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో

ABN , First Publish Date - 2020-06-28T17:06:58+05:30 IST

లైవ్ షోల్లో కొత్త ట్రెండ్‌కు ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో శ్రీకారం చుట్టింది.

ప్రవాసులను అలరించిన ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో

కళాకారులు, సిలికానాంధ్ర సంజీవనీ వైద్యాలయ అభివృద్ధి కోసం

మిచిగాన్, జూన్ 27: లైవ్ షోల్లో కొత్త ట్రెండ్‌కు ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో శ్రీకారం చుట్టింది. కరోనా నేపథ్యంలో పని దొరక్క కష్టాలపాలైన కళాకారుల కోసం, సిలికానాంధ్ర సంజీవని ఆస్ప‌త్రుల‌ అభివృద్ధి కోసం మ్యూజికల్ షోలు ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆర్పీ వర్చువల్ లైవ్ షో ఇక ముందు షోలు ఇలా కూడా జరుపుకోవచ్చనే ఓ ట్రెండ్‌ను సృష్టించాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌)తో పాటు పదికి పైగా తెలుగు సంఘాలు, సంస్థలు ఈ  వర్చువల్ లైవ్ షోకి మద్దతు తెలిపాయి. తమ సహాయ సహకారాలు అందించాయి.


ఆర్పీ పట్నాయక్ తన తోటి గాయనీ, గాయకులైన సత్యయామిని, సాహితీ సోనీ, అనుదీప్ దేవ్మనీషా ఈరబత్తినిలతో అలరిస్తూనే మరో వైపు అమెరికాలో ప్రతిభ కలిగిన స్థానిక గాయనీ, గాయకులకు ఇందులో పాటలు పాడే అవకాశం కల్పించారు. సూపర్ హిట్ సాంగ్స్  ఎంచుకున్న అమెరికాలో ప్రవాస తెలుగు గాయకులు తమ గాన మాధుర్యాన్ని పంచారు. ఆర్పీ పట్నాయక్ సినిమాల్లోని పాటలతో పాటు తెలుగు సినిమాల్లోని ఆణిముత్యాలను వర్చువల్ షోలో పాడి వినిపించారు. ఈ లైవ్ లో తన్మయులై చిందేసిన వారిని ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ చేసి వారి విజువల్స్ ప్లే చేయడంతో.. ఆటకు పాట కూడా జోడై.. ఈ షో మరింత రక్తి కట్టింది. హైదరాబాద్ నుంచి ఆర్పీ పట్నాయక్ లైవ్ షో నిర్వహిస్తూనే ఆన్‌లైన్‌లో అనేక మంది గాయనీ, గాయకులను అనుసంధానం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ వర్చువల్ లైవ్ షో విజయవంతం కావడానికి ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా అధినేత అశోక్ బడ్డి, మిచిగాన్ నుంచి శ్రీని తొంట, హరి దేవబత్తుని, స్వప్న చిల్లా... ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నుంచి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ కంచర్ల... చికాగో నుండి రాజ్పొట్లూరి, చాందిని దువ్వూరి, తదితరులు కీలక పాత్ర పోషించారు. వర్చువల్ లైవ్‌ను లక్ష పాతిక వేల మంది ప్రవాసులు వీక్షించారంటే ఈ షో ఎంత హిట్ అయిందనేది ఇట్టే తెలిసిపోతోంది. భవిష్యత్తులో ఇక ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్‌లైన్‌లోనే ఎలా చేయవచ్చనేది ఈ షో ఓ ఉదాహ‌రణగా నిలిచిపోనుంది. 


అమెరికాలో సిలికానాంధ్ర, సంజీవని హాస్పిటల్, సాయి దత్త పీఠం, తెలుగు ఫైన్ ఆర్ట్స్సొసైటీ (టి.ఎఫ్.ఏ.ఎస్) తెలుగు అసోసియేషన్ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియా(TASC), శాండియాగో తెలుగుఅసోసియేషన్, NRIVA వంటి తెలుగు సంస్థలు, సంఘాల సహకారంతో ఈ షో విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వారం ముందు మాత్రమే వారిని సంప్రదించినప్పటికీ ఈ ఈవెంట్‌కు తమ పూర్తి సహకారం అందించిన నాట్స్ సంస్థను ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా అధినేత అశోక్ బడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 


Updated Date - 2020-06-28T17:06:58+05:30 IST