ముంచుకొస్తున్నా.. మీనమేషాలే!

ABN , First Publish Date - 2022-01-20T04:58:37+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.

ముంచుకొస్తున్నా.. మీనమేషాలే!
నరసరావుపేటలోని గతంలో టిడ్కో గృహాలలో నిర్వహించిన కొవిడ్‌ కేర్‌ కేంద్రం

  టిడ్కో గృహాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు

అక్కడ వద్దంటూ ప్రభుత్వ కార్యదర్శి నుంచి ఆదేశాలు

కల్యాణ మండపాలైతే బాగుంటుందని సూచన

మల్లగుల్లాలు పడుతున్న మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు


కరోనా విజృంభిస్తోంది. మూడోవేవ్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గతంలో వలే నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులలో కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను టిడ్కో గృహాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అక్కడ వద్దంటూ, కల్యాణమండపాల్లో ఏర్పాటు చేయాలంటూ మునిసిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు సందిగ్ధంలో పండింది. 


నరసరావుపేట, జనవరి 19: కరోనా కట్టడిలో భాగంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. బాధితులకు వైద్య పరీక్షలు అందించడంలో ఇంకా యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ప్రధానంగా బాధితులను కేర్‌ సెంటర్‌లకు తరలించాల్సి ఉంటుంది. ఈ దిశగా జిల్లాలో ప్రయత్నాలే మొదలు కాలేదు. బుధవారం జిల్లాలో మొత్తం 943 కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో చేసిన లెక్కలు మాత్రమే. యాంటింజన్‌ కిట్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. లక్షణాలు కన్పించినవారు ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా కొవిడ్‌ నిర్ధారణ అయిన వారు ప్రభుత్వ లెక్కల్లోకి రావడంలేదు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

  కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో కరోనా సోకిన పేదలు ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోంది. కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా గదిలో ఉంచే పరిస్ధితి లేని బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కరోనా వ్యాప్తి అధికమవుతున్నట్టు వైద్యుల అంచనాగా ఉంది. ఇలాంటి వారి కోసం కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ దిశగా సత్వర చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. దీంతో బాధితులు అందోళకు గురౌతున్నారు. 

 నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులలో కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను గతంలో వలే టిడ్కో గృహాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు విరుద్ధంగా టిడ్కో గృహాల్లో కొవిడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని ముసిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి సంబంధిత అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ గృహాలను లబ్ధిదారులకు అందజేయన్నుట్టు ఇందులో పేర్కొన్నారు. ఒక్కో చోట వందల సంఖ్యలో టిడ్కో గృహాలు ఉన్నాయి. ఈ స్థాయిలో మరోచోట కొవిడ్‌ కేంద్రాల ఏర్పాటు సాధ్యం అయ్యే పరిస్థితులు కానరాక పోతుండటంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కల్యాణ మండపాలను కేంద్రాలకు వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇవి నివాసాల మధ్య ఉంటడంతో వీటిలో కేంద్రాలు ఏర్పాటు చేయడం వలనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఆర్డీవో శేషిరెడ్డిని వివరణ కోరగా టిడ్కో గృహాల విషయంలో వచ్చిన ఆదేశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.  

Updated Date - 2022-01-20T04:58:37+05:30 IST