ఆఫ్ఘన్‌లో పాక్ జోక్యం వద్దు : ఢిల్లీ డిక్లరేషన్

ABN , First Publish Date - 2021-11-10T21:23:43+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌పై బుధవారం ఢిల్లీలో జరిగిన వివిధ

ఆఫ్ఘన్‌లో పాక్ జోక్యం వద్దు : ఢిల్లీ డిక్లరేషన్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌పై బుధవారం ఢిల్లీలో జరిగిన వివిధ దేశాల భద్రతాధికారుల సమావేశం ఆ దేశంలోని తాలిబన్ల ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు. కేవలం స్వతంత్రంగా వ్యవహరించాలని, అన్ని వర్గాలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పాలించాలని సలహా మాత్రమే ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రాదేశిక సమగ్రత కొనసాగాలని చెప్పింది. ఇతర దేశాల జోక్యాన్ని వ్యతిరేకించింది. అంటే పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ పెద్దలు ఆఫ్ఘనిస్థాన్‌లో జోక్యం చేసుకోరాదని పరోక్షంగా తెలిపింది. ఈ సమావేశం అనంతరం ఏకాభిప్రాయంతో ఓ ప్రకటనను విడుదల చేశాయి.


భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అధ్యక్షతన వివిధ దేశాల అత్యున్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం ఢిల్లీలో బుధవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఏకాభిప్రాయంతో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై చర్చించినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రత పరిస్థితి, దాని వల్ల ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో కలిగే పరిణామాలపై చర్చించామని తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు. కేవలం స్వతంత్రంగా వ్యవహరించాలని, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే సలహా ఇచ్చారు. 


ఆఫ్ఘనిస్థాన్ భౌగోళిక సమగ్రత కొనసాగాలని నొక్కి వక్కాణించారు. బయటి శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తన పాత్రను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఇది పరోక్ష సంకేతంగా భావించాలి. ఆఫ్ఘనిస్థాన్ గడ్డను ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, కుట్ర పన్నడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించరాదని తెలిపింది. రాడికలైజేషన్, అతివాదం, వేర్పాటువాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటివాటికి వ్యతిరేకంగా పోరాడటం కోసం సమష్టి సహకారం అవసరమని తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరి అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. తాలిబన్లు ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితుడు, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హమీద్ రెండుసార్లు కాబూల్‌లో పర్యటించారు. ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీకి ఫయజ్ హమీద్ గట్టి మద్దతుదారుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఈ సంకేతాలను పంపించింది. 


యుద్దం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత పరిస్థితుల కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు అనుభవిస్తుండటంపై ఈ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాబూల్, కాందహార్, కుందుజ్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించింది. 


తజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, కజక్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, రష్యా, ఇరాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/భద్రతా మండలి కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-10T21:23:43+05:30 IST