Sep 23 2021 @ 09:36AM

NTR: ఫ్యాన్సీ నంబర్ కోసం అన్ని లక్షలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నంబర్ కోసం పోటీ పడిమరీ భారీ మొత్తానికి తనకు కావాల్సిన లక్కీ నంబర్ దక్కించుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ లాంబోర్గిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు 3.43 కోట్లు అని సమాచారం. అంత ఖరీదైన కారుకి ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో ఎన్టీఆర్ పోటీపడ్డారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం నిర్వహించారు. 'TS 09 FS 9999' అనే ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకోవడానికి ఎన్టీఆర్ ఏకంగా 17 లక్షలను చెల్లించారట. 

ఎన్టీఆర్ తన లక్కీ నంబర్ 9 అని భావిస్తారు. అందుకే తన కార్లకి అన్నీ 9999 వచ్చేలా చూసుకుంటారు. ఆయన తాతయ్య 9999 నంబరు గల కారును ఉపయోగించేవారనీ, అలాగే తన తండ్రి కూడా అదే నంబర్ కలిగిన కారును వాడేవారనీ, అందుకే ఈ నెంబర్ తనకి ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తానని ఎన్టీఆర్ ఇంతక ముందు కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఇప్పుడు భారీ మొత్తానికి తన లక్కీ నంబర్‌ను దక్కించుకున్నారు. కాగా ఆయన మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్‌'లో నటిస్తున్నారు. త్వరలో కొరటాల శివతో తన 30 చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.