Apr 15 2021 @ 07:33AM

కాంబినేషన్స్ తారుమారు..షాక్‌లోఫ్యాన్స్..!

ఒక కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేశాక దాదాపు అదే కాంబినేషన్‌తో సినిమా సెట్స్ మీదక రావడం .. పూర్తి కావడం.. థియేటర్స్ వరకు రావడం జరుగుతుతుంది. చాలా తక్కువ సందర్భాలలో ఒక కాంబినేషన్ సెట్ అయ్యాక అనుకోని పరిణామాలు చోటు చేసుకొని కొంతకాలం ఆ కాంబినేషన్‌లో అనుకున్న ప్రాజెక్ట్ పెండింగ్‌లో పడి మరో కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుంది. ఈ లోపు ఫ్యాన్స్ చాలా ఊహించేసుకుంటారు. బాక్సాఫీస్ లెక్కలు రాసేసుకుంటారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలిజీ సపోర్ట్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనగానే అందరికీ మైండ్ బ్లాకవుతుంది. రీసెంట్‌గా ఇలానే రెండు పెద్ద కాంబినేషన్స్‌లో తెరకెక్కాల్సిన సినిమాలు పెండిగ్ పడి అభిమానులకి షాకిచ్చాయి. 

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ - మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక పాన్ ఇండియన్ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ దాదాపు క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. అందుకు కారణం తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రకటన రావడమే. ఈ సినిమాని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించబోతున్నాయి.

ఇక కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్‌తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సింది. ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కొరటాల శివ సినిమా చేయాలి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రకటనతో అనుకున్న కాంబినేషన్స్ మొత్తం మారిపోయాయి. అల్లు అర్జున్ నెక్స్ట్ ఐకాన్ చేస్తాడా లేక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తాడా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎన్టీఆర్‌తో అనుకున్న కథని త్రివిక్రమ్ మహేష్‌తో చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కాంబినేషన్స్ మారడంతో ఇటు ఎన్టీఆర్, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.