రూ.400 కోట్లూ లాగేశారు

ABN , First Publish Date - 2021-11-30T08:25:54+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఎన్ని అభ్యంతరాలు, విమర్శలు వచ్చినా సర్కారు తాను అనుకున్నదే చేసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం లోపు అత్యంత రహస్యంగా వర్సిటీ నిధుల బదలాయింపు ప్రక్రియ జరిగిపోయింది. ప్రొసీడింగ్స్‌ ఇచ్చే వరకూ ఉద్యోగులకు కూడా తెలియకుండా..

రూ.400 కోట్లూ లాగేశారు

  • ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఖజానా ఖాళీ 
  • రూ.250 కోట్లు అడిగితే.. మొత్తం ఇచ్చేశారు
  • హడావుడిగా ఎస్‌ఎఫ్‌ఎస్‌సీకి మళ్లించిన ప్రభుత్వం
  • నాడు కుదరదన్న వీసీ.. ఒత్తిడి లేదని బుకాయింపు
  • ఇప్పుడు అడిగిన దానికంటే ఎక్కువ బదలాయింపు
  • నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా ప్రక్రియ 
  • మండిపడ్డ సిబ్బంది.. వీసీ చాంబర్‌లో బైఠాయింపు
  • నేటి నుంచి విధుల బహిష్కరణకు నిర్ణయం

ఆస్తులు తాకట్టు పెడుతూ, అడ్డగోలుగా అప్పులు చేస్తున్నా.. రాష్ట్ర సర్కారుకు నిధులు చాలడం లేదు. చివరకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిధులనూ స్వాహా చేసేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా.. ఈసీ సభ్యుల సలహాలు, సూచనలు లేకుండా.. ఏకంగా రూ.400 కోట్లు స్వాహా చేసేసింది..! ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో హెల్త్‌ వర్సిటీ నిధులను అధికారులు ఏకపక్షంగా స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించేశారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఎన్ని అభ్యంతరాలు, విమర్శలు వచ్చినా సర్కారు తాను అనుకున్నదే చేసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం లోపు అత్యంత రహస్యంగా వర్సిటీ నిధుల బదలాయింపు ప్రక్రియ జరిగిపోయింది. ప్రొసీడింగ్స్‌ ఇచ్చే వరకూ ఉద్యోగులకు కూడా తెలియకుండా చేసేశారు. ఉద్యోగులు తెలుసుకునే లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. వర్సిటీ నిధులు మొత్తం రూ.400 కోట్లను స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ)కు మళ్లించారు. ఇదేమిటని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. ‘నా బాస్‌ నాకు చెప్పారు. చేసేశాను. హెల్త్‌ వర్సిటీ సంక్షేమం, మనుగడ, ఉద్యోగుల భవిష్యత్తు నాకు అనవసరం. నా బాస్‌ నాకు దేవుడు’ అన్న సమాధానాలు వచ్చాయి. నిఽధులు మళ్లింపు, అధికారుల సమాధానాలపై ఉద్యోగులు భగ్గుమన్నారు. దీనిపై భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం నుంచి విధులకు హాజరు కాబోమని, విధులను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 


2 వారాల్లో సీన్‌ రివర్స్‌ 

ఈ నెల 9వ తేదీన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సిఫార్సులతో ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ నుంచి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఒక లేఖ వచ్చింది. నిధులు బదలాయించాలన్నది లేఖలోని సారాంశం. ఇందుకు వర్సిటీ తిరస్కరించింది. వర్సిటీ నిధులు జాతీయ బ్యాంక్‌లు మినహా ఇతరత్రా వాటికి బదలాయించే పరిస్థితి లేదని చెప్పారు. ఆ రోజు నుంచి వర్సిటీ ఉన్నతాధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వర్సిటీ వీసీ నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారు. ఈసీ మీటింగ్‌ అనుమతి తీసుకుని నిధులు మళ్లించేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అప్పుడు పత్రికల్లో కథనాలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. ఈ నెల 13న జరిగిన ఈసీ మీటింగ్‌లో మిగిలిన జాతీయ బ్యాంక్‌ల మాదిరిగానే ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ కూడా టెండర్లలో పాల్గొనేందుకు ఈసీ అనుమతిచ్చింది. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం టెండర్లు ఆహ్వానించినప్పుడు ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాటిలో డిపాజిట్‌ చేస్తామని ఈసీ మెంబర్లు స్పష్టం చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఈసీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని మీడియా ముఖంగా వీసీ డా.పి.శ్యామ్‌ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డా.శంకర్‌ ప్రకటనలు చేశారు. రెండు వారాల వ్యవధిలోనే సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. 


నిబంధనలు తుంగలోకి.. 

గత 36 ఏళ్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో వర్సిటీ పాటిస్తున్న నిబంధనల్ని మొత్తం తుంగలో తొక్కేశారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను పక్కకు పెట్టేశారు. వర్సిటీ యాక్ట్‌ను బుట్టదాఖలు చేసి అడ్డగోలుగా నిధులు మళ్లించుకున్నారు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో ముందుగా ఈసీ మీటింగ్‌ నిర్వహిస్తారు. టెండర్లు ఆహ్వానించేందుకు ఆమోదిస్తారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలుస్తారు. ఏ బ్యాంక్‌ ఎక్కువ వడ్డీ ఇస్తుందో అందులో నిధులు డిపాజిట్‌ చేస్తారు. ఇప్పుడు ఈ నిబంధనలు ఏమీ లేవు. ఏకపక్షంగా రూ.400 కోట్లను ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీలో డిపాజిట్‌ చేయాలని ప్రొసీడింగ్స్‌ ఇచ్చేశారు. ప్రస్తుతంవర్సిటీ నిధులు కెనరా బ్యాంక్‌లో రూ.400 కోట్లు ఎఫ్‌డీ రూపంలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ మళ్లించాలని కెనరా బ్యాంక్‌కు కూడా ఆర్డర్లు ఇచ్చేశారు.


దీనిపై కెనరా బ్యాంక్‌ కూడా స్పందించినట్లు సమాచారం. వర్సిటీ చేసిన ఎఫ్‌డీలు మెచ్యూరిటీ కావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ ఆగకుండా.. ఇప్పటికిప్పుడు నిధులు మళ్లిస్తే వర్సిటీకి ఇబ్బంది వస్తుందని బ్యాంకు అధికారులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే వర్సిటీ అధికారులు లెక్క చేయకుండా.. ‘మా నిధులు మా ఇష్టం.. మేము చెప్పింది చేయండి’’ అని సమాధానం చెప్పిట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 13 వరకూ రూ.250 కోట్లు మాత్రమే అడిగిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు రూట్‌ మార్చారు. వర్సిటీలో ఉన్న మొత్తం రూ.400 కోట్లు లాగేశారు.


రూ.43 కోట్ల వరకూ నష్టం

ఎఫ్‌డీల రూపంలో ఉన్న నిధులను అకస్మాత్తుగా ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీకి మళ్లించడం వల్ల హెల్త్‌ వర్సిటీ దాదాపు రూ.43 కోట్ల వరకూ వడ్డీ నష్టపోతుంది. ప్రస్తుతం కెనరా బ్యాంక్‌లో వర్సిటీ నిధులు రూ.400 కోట్లు ఉన్నాయి. ఎఫ్‌డీలకు మెచ్యూరిటీ రావడానికి మరో ఏడాది పడుతుంది. అప్పటి వరకు ఆగితే ఎఫ్‌డీ చేసిన రూ.400 కోట్లతో పాటు వడ్డీ మరో రూ.43 కోట్లు వచ్చేది. మెచ్యూరిటీ తీరకుండా ఎఫ్‌డీలను వెనక్కి తీసుకోవడంతో సుమారు రూ.43 కోట్ల వరకూ నష్టం వస్తుంది. మరోవైపు ఈ నెల 9వ తేదీన ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ నుంచి వర్సిటీకి వచ్చిన లేఖలో తమ వద్ద ఎఫ్‌డీ చేస్తే 5.1 శాతం వడ్డీ ఇస్తామని పేర్కొంది. అప్పుడు అంతా గందరగోళం కావడంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. మళ్లీ ఈ నెల 25వ తేదీన ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ నుంచి వర్సిటీకి మరో లేఖ వచ్చింది. ఈ సారి 5.5 శాతం వడ్డీ ఇస్తామని లేఖలో పేర్కొంది. ఈ ప్రతిపాదనల మేరకు వర్సిటీ అధికారులు నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యాయి. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్‌డీలు ఉన్న బ్యాంక్‌ నుంచి ప్రతి మూడు నెలలకు వర్సిటీకి వడ్డీ వస్తుంది. అయితే ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీ వడ్డీ ఇస్తుందా..? అన్నదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఎఫ్‌డీల్లో ఉన్న రూ.400 కోట్ల పరిస్థితి ఏమిటన్నది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


నేటి నుంచి విధుల బహిష్కరణ 

నిధులు మళ్లింపు ప్రక్రియ హెల్త్‌ వర్సిటీలో అగ్గిరాజేసింది. అధికారులు వర్సెస్‌ ఉద్యోగులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వీసీ, రిజిస్ట్రార్‌ మినహా మిగిలిన వారంతా ఉద్యోగుల పక్షాన నిలుస్తున్నారు. నిధులు మళ్లింపును వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి విధులను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలో రెండు యూనియన్లు ఒకే మాటపై నిలబడి ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నాయి. రెండు యూనియన్లకు చెందిన ఉద్యోగులు సోమవారం సాయంత్రం వీసీ చాంబర్‌లో బైఠాయించి ఆందోళన చేశారు. అయితే అత్యవసర సమావేశానికి రావాలంటూ ఉద్యోగులను రిజిస్ట్రార్‌ ఆహ్వానించారు. ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. వర్సిటీ ప్రారంభించి 36 ఏళ్లు అయ్యింది. వర్సిటీ నిర్వహణకు ప్రతి ఏటా రూ.70 నుంచి రూ.80 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకే ఏడాదికి రూ.18 కోట్లు పోతుంది. ప్రభుత్వం నుంచి కనీసం ఉద్యోగుల జీతాలకు కూడా గ్రాంట్‌ ఇవ్వడం లేదు. ప్రతి ఏటా బడ్జెట్‌లో కేవలం రూ.5 కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లు మొత్తం వర్సిటీ నిధుల నుంచి ఇస్తున్నారు. చివరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు, అడ్మిషన్లకు, అకడమిక్‌ కార్యకలాపాలకు కూడా ప్రభుత్వం ఒక్క రుపాయి ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వర్సిటీ నిధులు ఎలా తీసుకుంటారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 


తెలంగాణకు 170 కోట్లు బకాయి

తెలంగాణకు సంబంధించి రూ.170 కోట్లు హెల్త్‌ వర్సిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు తెలంగాణలోని హెల్త్‌ వర్సిటీ అడిగితే ఏం సమాధానం చెబుతారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి తమకు సమాధానం వచ్చే వరకూ విధులకు హాజరు కాబోమని ఉద్యోగ సంఘాల నేతలు సృష్టం చేశారు. 

Updated Date - 2021-11-30T08:25:54+05:30 IST