కాళ్లరిగినా...కాసులు అందవే!?

ABN , First Publish Date - 2020-02-23T05:49:48+05:30 IST

జిల్లాలోని ఎన్టీఆర్‌ పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో

కాళ్లరిగినా...కాసులు అందవే!?

ఎన్టీఆర్‌ గృహ లబ్ధిదారుల ఎదురుచూపు

రూ.90 కోట్ల బకాయిలు


మరుగుదొడ్డే నివాసంగా..

అసంపూర్తిగా మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇది సంగం రాళ్లచెలికలోని గిరిజనకాలనీకి చెందిన యాకసిరి వెంకట రమణమ్మది. కాలనీ మంజూరు కావడంతో అప్పోసొప్పో చేసి గోడల వరకు నిర్మించింది. బిల్లు రాలేదు. ఏడాదిన్నర అయిం ది. ఆర్థిక స్థోమత లేక, అప్పు ఇచ్చేవారు లేక వదిలేసింది.  తలదాచుకునేందుకు వసతి లేక ఉపాధి హామీలో నిర్మించిన మరుగుదొడ్డినే నివాస గృహంగా వినియోగిస్తోంది.


టార్ఫాలిన్‌ పట్టలతో ఆవాసం

రాళ్లచెలిక కాలనీకి చెందిన గిరిజన మహిళ నాగముంతల సలోమి సొంతింటి కలతో ఉన్న ఇళ్లు తొలగించి చేపట్టిన పక్కా గృహం బిల్లులు రాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిం ది. ఉండేందుకు అవకాశం లేక టార్ఫాలిన్‌ పట్టలతో తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుని తలదాచుకుంటోంది.


సంగం, ఫిబ్రవరి 22 : జిల్లాలోని ఎన్టీఆర్‌ పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో సుమారు 35 వేల పక్కాగృహ లబ్ధిదారుల పరిస్థితి ఇంతే. సొంతింటి కల నెరవేరకపోగా నీడ కోల్పోయి వీధిన పడ్డారు. జిల్లాలో పేదలందరికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథ కం, ప్రధానమంత్రి యోజన పథకంలో 2016 -17, 2017-18, 2018-19, 2019-20 నాలుగు విడతలుగా జిల్లా వ్యాప్తంగా 39,500 పక్కాగృహాలు మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ పక్కా గృహాలకు రూ.1.5 లక్షలు, పీఎంవై పథకంలో రూ.2 లక్షలు చొప్పున కేటాయించారు. దీంతో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం ప్రోత్సాహకం తక్కువే అయినా సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టారు. మొదటి విడత బిల్లులు వచ్చేశాయి. రెండు, మూడు విడతలు నిర్మాణాల్లో ఉన్న పక్కా గృహాలకు బిల్లులు విడుదల చేసే సమయంలో ఎన్నికలు రావడంతో బిల్లులు నిలిచిపోయాయి. 


సుమారు రూ.90 కోట్ల బకాయిలు

జిల్లాలో పక్కా గృహ లబ్ధిదారులు సుమారు రూ.90 కోట్ల మేర బకాయిలు నిలిచిపోయాయి. మొదటి విడతలో ప్రారంభించిన పక్కాగృహాలు సుమారు 11,228 ఇళ్లు పూర్తయ్యాయి. ఆ తరువాత రెండు, మూడు, నాలుగు విడతల్లో ప్రారంభించిన పక్కాగృహాల్లో 148 పునాదులు, 3,665 బేస్‌మెంట్‌, 92 లెంటల్‌ స్థాయి, 1241 గృహాలు రూప్‌ లెవల్‌లో ఉన్నాయి. అదేవిధంగా పీఎంవై పథకంలో చేపట్టిన 3674 పక్కాగృహాల్లో 393 పునాదులు, 112 బేస్‌మెంట్‌, 11 లెంటల్‌, 80 రూప్‌ లెవల్‌ స్థాయిలో ఉన్నాయి. సంగం మండలంలో గత ప్రభుత్వం లో 815 పక్కాగృహాలు మంజూరు కాగా 711 పూర్తయ్యాయి. ఇంకా 101 వివిధ దశల్లో ఉన్నాయి. రెండు నెలల కొందట వివిధ దశల్లో ఉన్న పక్కాగృహాలను సర్వే చేసి ప్రభుత్వ  యాప్‌లో నమోదు చేయమని ఆదేశించింది. ఆ మేరకు హౌసింగ్‌ అధికారులు సర్వే చేసి యాప్‌లో నమోదు చేశారు. కానీ ఇంతవరకు బిల్లులు విడుదల కాలేదు.


అవస్థల్లో లబ్ధిదారులు

 నిర్మాణాలు ప్రారంభించిన కొందరు అప్పోసొప్పో చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. మరికొందరు ఆర్థికస్థోమత లేక, అప్పులు పుట్టక అసంపూర్తిగా వదిలేశారు. ఉన్న ఇళ్లు పోయి  తలదాచుకునేందుక వీలులేక కొందరు పట్టలు కట్టుకుని, మరికొందరు మరుగుదొడ్లే నివాసాలుగా తలదాచుకుంటున్నారు.  బిల్లుల కోసం ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు. తొమ్మిది నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సర్వేల పేరుతో ఒక్క బిల్లు కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి. 


బకాయిలు ఇవ్వకుండానే.. 

జిల్లాలో ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న పక్కాగృహాలకు బకాయిలు ఇవ్వకుండానే ఉగాది నాటికి అర్హులందరికీ స్థలా లు, పక్కాగృహాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త లబ్ధిదారులు పక్కాగృహ నిర్మాణాలకు ముందుకు వస్తా రా అనే సందేహం కలుగుతోంది. అధికారులు పక్కా లబ్ధిదారులకు బిల్లు బకాయిలు విడుదల చేయాలని పాత లబ్ధిదారులు కోరుతున్నారు.


ఉన్నతాధికారులకు నివేదించాం..నటరాజన్‌, డీఈ, ఆత్మకూరు

 నియోజకవర్గంలో వివిధ దశల్లో ఉన్న పక్కాగృహాలను యాప్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిం చాం. నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం.

Updated Date - 2020-02-23T05:49:48+05:30 IST