కడపతో ఎన్టీఆర్‌ది విడదీయని బంధం

ABN , First Publish Date - 2020-05-28T10:36:53+05:30 IST

కడపతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. సినిమా షూటింగ్‌లే కాదు..

కడపతో ఎన్టీఆర్‌ది విడదీయని బంధం

బ్రహ్మంగారి జీవితచరిత్ర షూటింగ్‌ నెలరోజులూ ఇక్కడే


కడప, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కడపతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. సినిమా షూటింగ్‌లే కాదు.. రాజకీయ ఆరంగేట్రం తరువాత పలు సభలకు హాజరయ్యారు. ఓ సామాన్య కార్యకర్త పెళ్లికి ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా షూటింగులో భాగంగా నెలరోజులకు పైగా బ్రహ్మంగారి మఠంలోనే నిష్టతో గడిపారు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొండలు, గుట్టలు ఎక్కి దిగారు. ఆ సమయంలో కడప జిల్లా కరువును కళ్లారా చూసిన ఎన్టీఆర్‌ ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 17.5 టీఎంసీలతో బ్రహ్మంసాగర్‌ నిర్మాణం చేపట్టారు.


ఈ ప్రాజెక్టు శంకుస్థాపనలో భాగంగా నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో కలిసి ఎన్టీఆర్‌ భూమిపూజ చేశారు. బద్వేలులో జరిగిన సభలో ప్రసంగించారు. 1650 మెగావాట్ల సామర్థ్యంతో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు 1989లో పునాది రాయి వేశారు. నందలూరులో ఆల్విన్‌ పరిశ్రమ  స్థాపనకు ఎన్టీఆర్‌ కృషి ఎనలేనిది. అంతేకాదు.. కడపతో పాటు సీమ జిల్లాలకు కృష్ణాజలాలు మళ్లించాలనే మహోన్నత లక్ష్యంతో గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముందే జిల్లాలో ఎన్టీఆర్‌ పర్యటించి పలు రాజకీయ సభల్లో ప్రసంగించారు. 1983 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పలు ప్రచార సభల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీఎం హోదాలో కమలాపురంలో ఎన్టీఆర్‌ వీరాభిమాని అతుల్లాబాషా వివాహానికి హాజరు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-05-28T10:36:53+05:30 IST