పురిటికి పెద్దాసుపత్రి

ABN , First Publish Date - 2020-07-03T10:28:08+05:30 IST

కరోనా కష్టకాలంలో కాన్పులు చేసే విషయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు నై.. అంటే ఖమ్మం జిల్లా ఆసుపత్రి అధికారులు మాత్రం

పురిటికి పెద్దాసుపత్రి

కాన్పుల్లో ఖమ్మం మాతాశిశువిభాగం భేష్‌

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

లాక్‌డౌన్‌ సమయంలో 2,382కాన్పులు


ఖమ్మం సంక్షేమ విభాగం, జూలై 2: కరోనా కష్టకాలంలో కాన్పులు చేసే విషయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు నై.. అంటే ఖమ్మం జిల్లా ఆసుపత్రి అధికారులు మాత్రం మేమున్నామంటూ ముందుకొచ్చారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, రక్తహీనత, కామెర్లు దీర్ఘకాలిక వ్యాధులున్న మహిళలకు కూడా రిస్కును అధిగమించి సేవలందించారు. నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌ మెడికల్‌ కళాశాలల నుంచి రిఫర్‌ చేసిన కాన్పు కేసులను సైతం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ అధికారులతో భేష్‌ అనిపించుకుని.. కరోనా కష్టకాలంలో అత్యధిక కాన్పులు చేసి ఖమ్మం జిల్లా ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకొంది. సాధారణంగా జిల్లా ఆసుపత్రిలో రోజుకు 20నుంచి 25కాన్పులు.. నెలకు 450నుంచి 500కాన్పులు జరుగుతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో జరిగే కాన్పుల్లో 65శాతం కాన్పులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో కాగా 35శాతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత జిల్లా ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. ఇలా జిల్లాలో నమోదైన గర్భిణుల్లో 70శాతం వరకు ఇటు ప్రభుత్వ వైద్యసేవలతో పాటుగా అదనంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు పొందుతున్నారు.


అయితే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర వైద్యం అందించొచ్చని కలెక్టర్‌ కర్ణన్‌ ప్రకటించినా.. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు మాత్రం కాన్పులు చేసేందుకు వెనకడుగు వేశారు. ఒకటి, రెండు ఆసుపత్రులు మాత్రమే అత్యవసర కాన్పులు జరిగాయి. ఈ క్రమంలో జిల్లా ఆసుపత్రికి కాన్పుల కోసం వచ్చిన వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా మూడునెలల లాక్‌డౌన్‌ సమయంలో 2,382కాన్పులు చేసి ఖమ్మం జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీటిలో  ఎంతో రిస్కుతో కూడుకున్న 56కాన్పులను కూడా ఉన్నాయి. ఇలా విపత్కర సమయంలోనూ మెరుగైన సేవలందించినందుకు గాను జిల్లా ఆసుపత్రి మాతా శిశు విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్‌ కృపాఉషశ్రీ, ఇతర ప్రసవ వైద్య నిపుణులు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ అధికారుల నుంచి అభినందనలు అందుకున్నారు. 


మాసం కాన్పుల సంఖ్య

జనవరి 552

ఫిబ్రవరి 416

మార్చి 504

ఏప్రిల్‌ 844

మే 830

జూన్‌ 708


కరోనా కష్టకాలంలోనూ విశేష సేవలందించారు..కృపాఉషశ్రీ, మాతా శిశువిభాగం పర్యవేక్షకురాలు, ఖమ్మం జిల్లా ఆసుపత్రి

కరోనా కష్టకాలంలోనూ జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు, నర్సింగ్‌ ఉద్యోగులు ధైర్యంగా సేవలందించారు. కరోనా రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా కాన్పులు అపరేషన్‌ విభాగం ఏర్పాటు చేశాం. ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో 844కాన్పులు చేశాం. మూడునెలల లాక్‌డౌన్‌  సమయంలో 2,382 కాన్పులు జరగటంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో హైరిస్క్‌ ఉన్న 56మందికి కూడా కాన్పులు చేశాం. మాతాశిశువిభాగంలోని 75మంది నర్సింగ్‌ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర ఉద్యోగుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. 

Updated Date - 2020-07-03T10:28:08+05:30 IST