ఒకే ఊపిరితిత్తితో పోరాడి కరోనాను ఓడించిన నర్సు.. ఎలానో తెలుసా?

ABN , First Publish Date - 2021-05-13T20:42:53+05:30 IST

చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తును తొలగించారు

ఒకే ఊపిరితిత్తితో పోరాడి కరోనాను ఓడించిన నర్సు.. ఎలానో తెలుసా?

భోపాల్: చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ఆమె ఒక్కదానితోనే జీవిస్తోంది. అయినప్పటికీ ఆ విషయం ఆమెకు తెలియదు. 2014లో చెస్ట్ ఎక్స్ రే తీసుకున్నప్పుడు తనకు ఒక్క ఊపిరితిత్తి మాత్రమే ఉందన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఆమెకు 39 సంవత్సరాలు. నర్స్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఆ మహమ్మారితో ఒక్క ఊపిరితిత్తితోనే పోరాడిన ఆమె విజయం సాధించింది. 


మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ నర్సు పేరు ప్రఫులిత్ పీటర్. టికామ్‌గఢ్ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో పనిచేస్తున్న సమయంలో ఆమెకు వైరస్ సంక్రమించింది. దీంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. కరోనా తొలుత ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని తెలిసి భయపడిపోయారు. ఆమెకు ఒకటే ఊపిరితిత్తి ఉండడంతో కంగారుపడ్డారు. అయితే, 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.


కరోనా నుంచి కోలుకున్న ఆమె అదెలా సాధ్యమైందో వివరించింది. తనకు కరోనా సోకినప్పటికీ తాను ఏ దశలోనూ ధైర్యం కోల్పోలేదని పేర్కొంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేయడంతోపాటు ఊపిరితిత్తులకు మేలు చేసేందుకు బెలూన్లు ఊదేదానినని వివరించింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు ధైర్యమే తనను గెలిపించిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది.  

Updated Date - 2021-05-13T20:42:53+05:30 IST