బిడ్డకు నర్సరీ సీటు.. తండ్రిపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-10-21T08:02:28+05:30 IST

అదొక ప్రతిష్ఠాత్మక పాఠశాల. ఢిల్లీలో చాలామంది తల్లిదండ్రులు, తమ బిడ్డలను అందులో చదివించాలని ఆశ పడుతుంటారు. ..

బిడ్డకు నర్సరీ సీటు.. తండ్రిపై క్రిమినల్‌ కేసు

శ్రీమంతుడైనా.. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు యత్నం

న్యూఢిల్లీ, అక్టోబరు 20: అదొక ప్రతిష్ఠాత్మక పాఠశాల. ఢిల్లీలో చాలామంది తల్లిదండ్రులు, తమ బిడ్డలను అందులో చదివించాలని ఆశ పడుతుంటారు. అయితే.. సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దీంతో దండిగా చేతిలో పైసలున్నా.. బిడ్డకు సీటు దక్కేందుకు నిరుపేదగా నాటకం ఆడాడు ఆ తండ్రి. ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో సీటు సంపాదించాడు. అయితే.. ఈ పని ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదయ్యేందుకు దారి తీసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన, స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తండ్రి తన బిడ్డను నర్సరీలో చేర్పించడానికి ఇంత కష్టపడటం గమనార్హం. పాఠశాలలో అడ్మిషన్‌ కోసం బిడ్డ పేరును, తన పేరును కూడా సదరు తండ్రి మార్చేశాడు. స్కూల్‌ సమయం అయిపోగానే.. ద్విచక్రవాహనంపై బిడ్డను ఎక్కించుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత తన లగ్జరీ కారులోకి మార్చి ఇంటికి తీసుకెళ్లేవాడు. పాఠశాలలో చిన్నారి తనను అసలు పేరుతో పిలవమని అందరికీ చెబుతుండటంతో స్కూల్‌ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. తీగ లాగితే మొత్తం విషయం వెలుగుచూసింది. తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. రూ. లక్ష పూచీకత్తుతో కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2021-10-21T08:02:28+05:30 IST