మోదీకి టీకా వేసిన నర్సుల స్పందన

ABN , First Publish Date - 2021-04-08T15:20:31+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కోవిడ్-19 నిరోధక టీకా ఇచ్చిన నర్సులు

మోదీకి టీకా వేసిన నర్సుల స్పందన

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కోవిడ్-19 నిరోధక టీకా ఇచ్చిన నర్సులు చాలా సంతోషిస్తున్నారు. ఆయనను కలవడం, టీకా వేయడం తమ జీవితాల్లో మధురమైన, మర్చిపోలేని సంఘటన అని చెప్తున్నారు. సిస్టర్ నిషా శర్మ, సిస్టర్ పి నివేద ఆయనకు గురువారం ఉదయం కోవిడ్ టీకా రెండో డోసును ఇచ్చారు.


సిస్టర్ నిషా శర్మ చాలా సంతోషంతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం, ఆయనకు వ్యాక్సిన్ ఇవ్వడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని చెప్పారు. ఆమె పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందినవారు. 


మోదీకి ఈ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చి, తాజాగా రెండో డోసు ఇవ్వడంలో సహాయపడిన సిస్టర్ పి నివేద అమితానందంతో మాట్లాడుతూ, మోదీకి వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన వ్యాక్సినేటర్‌ను తానేనని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఆయనను కలిసేందుకు, ఆయనకు రెండో డోసు ఇచ్చేందుకు తనకు అవకాశం దక్కిందని చెప్పారు. తనకు ఈ అవకాశం దక్కడం పట్ల తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. మోదీ తమతో మాట్లాడారని, తాము ఆయనతో కలిసి సెల్ఫీలు దిగామని తెలిపారు. 


ప్రధాని మోదీ గురువారం ఉదయం న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. కోవిడ్‌ను ఓడించడానికి ఉన్న కొద్ది మార్గాల్లో వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఒకటని, అర్హులందరూ త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలను కోరారు. 


భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ మొదటి డోసును మార్చి ఒకటిన మోదీ తీసుకున్నారు. జనవరి 16 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 



Updated Date - 2021-04-08T15:20:31+05:30 IST