విచ్చలవిడిగా నాటుసారా విక్రయాలు

ABN , First Publish Date - 2021-05-17T05:38:29+05:30 IST

సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌ కర్ఫ్యూను నాటుసారా తయారీ, అమ్మకం దారులు అదనుగా తీసుకున్నారు.

విచ్చలవిడిగా నాటుసారా విక్రయాలు
నాటుసారా ప్యాకెట్లు

  1. కొవిడ్‌ కర్ఫ్యూ అదనుగా జోరుగా వ్యాపారం


 బనగానపల్ల్లె, మే 16: సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌ కర్ఫ్యూను నాటుసారా తయారీ, అమ్మకం దారులు అదనుగా తీసుకున్నారు. మండలంలో నాటుసారా దుకాణం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామంలో రెండు నుంచి 6 వరకు సారా విక్రయ కేంద్రాలు వెలిశాయి. వీటిలో బహిరంగ  విక్రయాలు కొనసాగుతున్నాయి. సారా తయారీ మండలంలో కుటీర పరిశ్రమగా మారింది. దీంతో సారా తయారీ, విక్రయాలు విపరీతమయ్యాయి.  కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 గంటలకే  పరిమితం కావడంతో నాటుసారా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చేయడంతో మద్యం ప్రియులు సారా వైపు మళ్లారు.  మద్యం ప్రియులు నాటుసారాను కూల్‌ డ్రింక్సులో కలుపుకొని సేవిస్తూ మద్యం మత్తులో తేలియాడుతున్నారు. దీంతో నాటుసార లీటరు ప్రస్తుతం రూ.300  ఎగబాకింది. మద్యం దుకాణాలు తెరిచినా తమకు ధరలు ఽఅధికంగా ఉండ డంతో నాటుసారా వైపు మద్యం ప్రియులు మొగ్గు చూపుతున్నారు. నాటు సారా అమ్మకానికి కొందరు గ్రామ నాయకులు కూడా మద్దతు ఇస్తుండడంతో అమ్మకాలకు  అడ్డు అదుపు లేకపోయింది. 


యథేచ్ఛగా అమ్మకాలు:  పాకెట్ల రూపంలో  నాటుసారా  అమ్ముతున్నారు. కొన్ని చోట్ల మోటారు సైకిళ్ల ద్వారా సారాను సరఫరా చేస్తున్నారు. బనగానపల్లె అవుకు మండలాల్లో కుటీర పరిశ్రమగా మారింది. మండలంలోని చిన్నరాజుపాలెం చిన్నరాజుపాలెం తండా, పసుపుల, పసుపుల తండా, అలేబాద్‌తండా, పెద్దరాజుపాలెం, అవుకు మండలం గడ్డమేకలపల్లె, మంగంపేట తండా, ఇస్రానాయక్‌ తండా, కొండమనాయునిపల్లె, మన్నే నాయక్‌ తండా, మర్రికుండ తండా, పిక్కిళ్లపల్లె తండా తదితర గ్రామాల్లో బట్టీలు కుటీర పరిశ్రమలుగా మారాయి. రోజులకు వందల లీటర్ల నాటు సారాను తయారు చేస్తున్నారు. లీటరు రూ.200 నుంచి రూ.300 వరకు విక్ర యిస్తున్నారు.  నాటుసారా సరఫరాచేసే వందలాది మోటారు సైకిళ్లను బనగా నపల్లె ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ శారు.  అయినా నాటుసారా తయారీ, సరఫరా ఆగడం లేదు.  లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నా నాటుసారా గ్రామాలకు  చేరిపోతోంది. బనగానపల్లె పట్టణంలోనే 10 నాటుసారా దుకాణాలు  ఉండగా ప్రతి గ్రామంలోను నాటుసారా అంగళ్లు 2 నుంచి 6 వరకు ఉన్నాయి.  ఎక్సైజ్‌ అధికారులు తూతూ మంత్రంగా కేసులునమోదు చేసి నాటుసారా తయారీ దారులకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   పోలీసులు కరోనా కర్ప్యూ విధుల్లో ఉండడంతో  నాటుసారాపై దృష్టి సారించలేక పోతున్నారు.   

Updated Date - 2021-05-17T05:38:29+05:30 IST