జస్టిస్ ఎన్‌వి రమణ ఘాటైన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-15T18:39:49+05:30 IST

ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జస్టిస్ ఎన్‌వి రమణ ఘాటైన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడంలేదని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని వ్యాఖ్యానించారు.


ఖాళీలు భర్తీ చేయడం కోసం రెండేళ్లు సమయం తీసుకున్నారని, ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని ఎన్‌వి రమణ అన్నారు. రూల్‌ ఆఫ్‌ లా.. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఒక ఏడాది పనిచేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందన్నారు.


ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. దిక్కరణ పిటిషన్‌ విచారణ వేళ ఏదో ఒకటి చెప్పడం అలవాటైందన్నారు. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో కౌంటర్‌ వేస్తామని ఏజీ చెప్పారు. అయితే కౌంటర్‌ దాఖలు సమస్యకు పరిష్కారం కాదని ఎన్‌వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావాల్సింది పరిష్కారమన్నారు. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత ఓపిక పట్టగలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదన్నారు. రెండువారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఎన్‌వి రమణ పేర్కొన్నారు.


జాతీయ గిరిజన కమిషన్‌ నియామకంలో ఇలాగే వ్యవహరించారని ఎన్‌వి రమణ అన్నారు. డిఆర్‌టిలో కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ కోల్‌కతా వెళ్లాల్సి వస్తోందని, కోల్‌కతాలో కూడా శాశ్వత సభ్యులు లేరని అన్నారు. జబల్‌పూర్‌ నుంచి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాగే చేస్తే.. సమస్యల పరిష్కారం ఎప్పటికి సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అటార్నీ కోరిన విధంగా రెండు వారాలు వాయిదా వేస్తామని చెప్పారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు.

Updated Date - 2021-09-15T18:39:49+05:30 IST