Abn logo
Jul 30 2021 @ 01:02AM

అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీ కోటా

  • ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కూడా.. వైద్య, దంత కోర్సుల్లోనూ వాటా..
  • ఓబీసీలకు 27ు.. అగ్రవర్ణ పేదలకు 10ు.. ఈ విద్యాసంవత్సరం నుంచే 
  • కేంద్రం వెల్లడి.. ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీలకు లబ్ధి
  • పీజీలో 2,500 మందికి మేలు.. ఓబీసీలకు మోదీ సర్కారు వరం!
  • కొత్త విద్యా విధానం వచ్చి ఏడాది సందర్భంగా 5 అంశాలపై ప్రకటన
  • విద్యార్థి నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు.. వదిలేయొచ్చు.. మళ్లీ చేరవచ్చు
  • తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులు 
  • అందరికీ ‘కృత్రిమ’ మేధస్సులో శిక్షణ: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య విద్యా కోర్సుల అఖిల భారత కోటా(ఏఐక్యూ)లో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు(ఈడబ్ల్యూఎస్‌) 10% కోటా ఇస్తున్నట్లు తెలిపింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ (పీజీ) వైద్య, దంత విద్యాకోర్సుల్లో ఈ రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కోటా సమస్యకు సమర్థ పరిష్కారం కనుక్కోవాలని ప్రధాని మోదీ గత సోమవారం సంబంధిత శాఖల మంత్రులను ఆదేశించారు. దానికి అనుగుణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.


‘‘ఈ నిర్ణయంతో ఏటా ఎంబీబీఎ్‌సలో 1,500 మంది ఓబీసీ విద్యార్థులకు, పీజీలో 2,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా వల్ల ఎంబీబీఎ్‌సలో ఆ వర్గాలకు చెందిన 550 మందికి, పీజీలో వెయ్యి మందికి లబ్ధి చేకూరుతుంది. ఏ రాష్ట్రంలోని సీటు కోసమైనా వారు పోటీపడొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ఓబీసీలకు చెందిన కేంద్ర జాబితా ప్రకారం నిర్ణయం అమలవుతుంది’’ అని తెలిపింది. 2021-22 నుంచి ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా, బీడీఎస్‌, ఎండీఎస్‌ కోర్సుల్లో ఈ రిజర్వేషన్‌ అమలవుతుందని స్పష్టం చేసింది. వైద్య విద్య అఖిల భారత కోటాలో రిజర్వేషన్లు కల్పించడంపై ఓబీసీ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. 


వేల మందికి ప్రయోజనం: ప్రధాని

ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అఖిల భారత కోటాలో రిజర్వేషన్‌ కల్పించడం తన ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చి గురువారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించడం దేశంలో సామాజిక న్యాయానికి సరికొత్త నమూనా అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో ఒకే స్ట్రీమ్‌కు పరిమితం కాకుండా ఉన్నత విద్యలో నచ్చిన కోర్సును ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు కల్పించే అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను ప్రారంభించారు.


మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడం కొత్త విధానంలో కీలకాంశమన్నారు. ఇంజనీరింగ్‌ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అనువదించే టూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అల్పాదాయ, బడుగు/బలహీన వర్గాలు, గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఇది సహాయకారిగా ఉంటుందన్నారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్‌ కాలేజీలు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో విద్యాబోధనకు సిద్ధపడడం అభినందనీయమన్నారు. కళాశాలలు మాతృభాషలో విద్యను అందించడానికి ఏఐసీటీఈ ప్రత్యేక డేటాబే్‌సను రూపొందిస్తోందని చెప్పారు. బధిర లిపి(ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌-ఐఎ్‌సఎల్‌)కి భాషా సబ్జెక్టు హోదా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇతర భాషల మాదిరిగానే పాఠశాలల్లో ఈ సబ్జెక్టును చదవొచ్చని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పించేందుకు ‘అందరికీ కృత్రిమ మేధస్సు’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 


అనేక కార్యక్రమాలకు శ్రీకారం

ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ‘నిష్ఠ-2.0’కు ప్రధాని శ్రీకారం చుట్టారు. పాఠశాల, ఉన్నత విద్యల్లో బోధన, అసె్‌సమెంట్‌, ప్లానింగ్‌, పరిపాలన తదితర అంశాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంపొందించే జాతీయ విద్యా సాంకేతిక పరిజ్ఞాన వేదిక(ఎన్‌ఈటీఎ్‌ఫ)ను ప్రారంభించారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 1986లో సుప్రీం ఆదేశాలతో..

స్థానికతతో నిమిత్తం లేకుండా ఏ రాష్ట్ర విద్యార్థులైనా ఏ రాష్ట్రంలోని మంచి వైద్య కళాశాలలోనైనా చదివేందుకు వీలుగా సుప్రీంకోర్టు 1986లో మార్గదర్శకాలు జారీ చేసింది. అదే ఏడాది అఖిల భారత కోటా పథకం(ఏఐక్యూ)ను కేంద్రం ప్రవేశపెట్టింది. యూజీ సీట్లలో 15%, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ సీట్లలో 50 శాతాన్ని అఖిల భారత కోటాగా ఖరారు చేసింది.


2007 వరకు ఏఐక్యూలో రిజర్వేషన్‌ లేదు. ఆ ఏడాది సుప్రీంకోర్టు ఈ కోటాలో 15% ఎస్సీల కు, 7.5% ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించింది.  2007లో కేంద్ర విద్యాసంస్థల చట్టం దేశవ్యాప్తం గా అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి, లేడీ హార్డింగ్‌ వైద్య కళాశాల, ఆలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం సహా అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ కల్పించారు. రాష్ట్రాల వైద్య, దంత వైద్య కళాశాలల అఖిల భారత కోటాలో దీన్ని అమలు చేయలేదు.