అడుగడుగునా అడ్డంకులు

ABN , First Publish Date - 2022-09-21T05:28:14+05:30 IST

జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు టెండర్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఎస్‌ఆర్‌ రేట్లను పెంచడంతో ఎట్టకేలకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

అడుగడుగునా అడ్డంకులు
తాంసి బస్టాండ్‌ రైల్వే గేటు వద్ద గుంపుగా ప్రయాణికులు

జిల్లాకేంద్రంలో అగ్రిమెంట్‌ దశ దాటని రైల్వే బ్రిడ్జి పనులు 

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలకు ఎప్పుడో.. పూర్తయిన టెండర్లు

సంబంధిత శాఖల మధ్య కరువైన సమన్వయం

స్థల సేకరణలో తీవ్ర జాప్యం

అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న కాంట్రాక్టర్‌

అందరి నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తప్పని పాట్లు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు టెండర్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఎస్‌ఆర్‌ రేట్లను పెంచడంతో ఎట్టకేలకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కానీ ఉన్నతాధికారుల అనుమతి రాకపోవడంతో పనులు మరింత ఆలస్యమ య్యే అవకాశం కనిపిస్తోంది. పట్టణవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది క్రితమే పరిపాలన అనుమతులు ఇచ్చినా.. టెండర్‌ ప్రక్రియలో మాత్రం జాప్యం జరుగుతూ వచ్చింది. నిధులు మంజూరు చేయించేందుకు మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. చివరకు టెండర్‌ పూర్తయినా.. అగ్రిమెంట్‌ చేసేందుకు అధికారులు ఆలస్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో మొదట రూ.27.63 కోట్ల అంచనాల తో అధికారులు ఐదుసార్లు టెండర్‌ పిలువ గా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రూ.30 కోట్లకు పైగా అంచనాలను పెంచి టెండర్‌ పిలువడంతో హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యం కాంట్రాక్ట్‌ కంపెనీ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. అయినా అడుగు ముందుకు పడడం లేదు. అండర్‌ బ్రిడ్జి నిర్మించే తాంసి బస్టాండ్‌, ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించే స్పిన్నింగ్‌ మిల్లు పరిసర ప్రాంతాలలో స్థల సేకరణ చేయాల్సి ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అసలే టెండర్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనన్న సందిగ్ధం నెలకొంది. రైల్వే బ్రిడ్జిల పనుల పర్యవేక్షణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించడంతో పనులు ముందుకు సాగడం లేదన్న వాదన లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు అగ్రిమెంట్‌ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్‌ కోరినా.. ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది.

స్థల సేకరణే ప్రధాన సమస్య

జిల్లా కేంద్రంలో చేపట్టే రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మూడు శాఖల మధ్య ముడిపడడం కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్థల సేకరణే ప్రధాన సమస్యగా మారనుంది. తాంసి బస్టాండ్‌ వద్ద స్థల సేకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేపట్టే బ్రిడ్జి నిర్మాణం వెడల్పు 12.40 మీటర్లు కాగా, బీటీ రోడ్డు వెడల్పు 7.50 మీటర్లు ఉండనుంది. ప్రస్తుతం ఇక్కడ నాలుగైదు మీటర్లు మాత్రమే రోడ్డు విస్తర్ణ కనిపిస్తోంది. అలాగే స్పిన్నింగ్‌ మిల్లు వద్ద నిర్మించే బ్రిడ్జి నిర్మాణం వెడల్పు 11.80 మీటర్లు కాగా, బీటీ రోడ్డు 14 మీటర్లు, అలాగే మట్టి రోడ్డు ఇరువైపులా మురుగు నీటి కాల్వల నిర్మాణానికి గాను మరో ఏడు మీటర్ల స్థల సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సముదాయాలను తొలగించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిపడా పరిహారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా.. దుకాణా సముదాయాలను తొలగించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఇరువైపులా నిర్మించే రైల్వే బ్రిడ్జిలకు భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు శాఖల అధికారులు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతుల కోసం ఎదురుచూపులు

టెండర్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం జిల్లా అధికారులు ఎదురు చూస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతులు వస్తేనే అగ్రి మెంట్‌ పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నెల రోజులు పూర్తయినా.. అప్రూవల్‌ రాలేదని చెబుతున్నారు. ఇన్నాళ్లు టెండర్‌ వేసేందుకే యేడాది గడిచింది. మళ్లీ అనుమతులు, అగ్రిమెంట్‌ అంటూ మరో ఆరు మాసాల పాటు కాలం గడిపే అవకాశం కనిపిస్తోంది. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తేనే సకాలంలో పనులు పూర్తికానున్నాయి. దాదాపుగా వర్షాకాలం సీజన్‌ కూడా గడిచి పోయింది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులకు అనువైన సమయమే కనిపిస్తోం ది. అధికారులు అగ్రిమెంట్‌, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేస్తే పనులు చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా..  అనుమతులు రాలేదంటూ ఆలస్యం చేయడంతో కాంట్రాక్టర్‌ కనిపించకుండా పోయాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల పూర్తి సహకారం ఉంటేనే అనుకున్నంత స్థాయిలో పను లు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులే ప్రధాన పాత్ర పోషించి రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణం కోసం భూసేకరణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించడంతో తీవ్ర జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ హెచ్చరించినా.. ఆర్‌అండ్‌బీ అధికారుల తీరు మాత్రం మారినట్లు కనిపించ డం లేదు.

అనుమతులు రాగానే అగ్రిమెంట్‌ పూర్తిచేస్తాం

: రాజేంద్రనాయక్‌, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, ఆదిలాబాద్‌

జిల్లా కేంద్రంలో నిర్మించే రెండు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే అగ్రిమెంట్‌ను పూర్తి చేస్తాం. ఇప్పటికే సర్వే పనులను చేపట్టడం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. టెండర్‌ పూర్తయి నెలరోజులే అయ్యింది. అనుమతుల కోసం మరింత సమయం అవసరం ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే పనులను ప్రారంభిస్తాం.

Updated Date - 2022-09-21T05:28:14+05:30 IST