Abn logo
Oct 20 2020 @ 03:35AM

ఆటో మ్యుటేషన్‌కు అడ్డంకులు!

Kaakateeya

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య సమన్వయలోపం

ఏడాదైనా అమలుకాని ప్రభుత్వ నిర్ణయం

రికార్డుల్లో పేరు నమోదుకు సవాలక్ష అభ్యంతరాలు

విసిగిపోతున్న కొనుగోలుదారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భూముల లావాదేవీలు ‘ఆటో మ్యుటేషన్‌’ కావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ వీటిని చేయాల్సిన రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆటో మ్యుటేషన్‌కు అనేక సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. వాటిని పరిష్కరించనంత కాలం...ఆటో మ్యుటేషన్‌ అందని ద్రాక్షగానే ఉంటుంది.


ఏమిటీ మ్యుటేషన్‌...?

ఎవరైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తే...దానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఫీజు కట్టి రిజిష్టర్‌ చేసుకుంటారు. అదే విషయం రెవెన్యూ రికార్డులోను నమోదుకావాలి. లేదంటే..అక్కడ ఇంకా పాత యజమాని పేరే ఉంటుంది. ఇలా కొనుగోలుదారు పేరు రెవెన్యూ రికార్డుల్లో మార్పించుకోవడాన్నే ‘మ్యుటేషన్‌’ అంటారు. ఇంతకు ముందు ఈ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటేనే తహసీల్దార్లు పేర్లు మార్చేవారు. దీనికి లంచాలు తీసుకునేవారు. అయితే చాలామందికి ఇలా మ్యుటేషన్‌ చేయించుకోవాలనే విషయం తెలియదు.


దీనివల్ల కొంతమంది అదే ఆస్తిని మళ్లీ మళ్లీ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటివల్ల తగాదాలు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ‘ఆటో మ్యుటేషన్‌’ విధానం ప్రవేశపెట్టింది. దీనికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించి రెండు శాఖలకు ఇచ్చింది. ఇక్కడ భూమి రిజిష్టర్‌ కాగానే ఆ సమాచారం తహసీల్దార్లకు వెళుతుంది. వారు దానిని పరిశీలించి 30 రోజుల్లో కొత్త యజమాని పేరు రెవెన్యూ రికార్డుల్లో మార్చాలి. దీనిని మొదట వ్యవసాయ భూముల లావాదేవీలకు అమలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 100 రిజిస్ట్రేషన్లు జరిగితే అందులో 20 కూడా ఆటో మ్యుటేషన్లు జరగడం లేదు. దీనికి తహసీల్దార్లు అనేక సమస్యలు చూపుతున్నారు.

- సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఏదైనా వ్యవసాయ భూమి డాక్యుమెంట్‌ వెళితే...అందులో సరైన సమాచారం వుండడం లేదని, ఆ భూమి ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో ఉందని, వెబ్‌ల్యాండ్‌లో వున్న భూమి విస్తీర్ణం కంటే..డాక్యుమెంట్‌లో ఎక్కువ రాసుకున్నారని కారణాలు చూపిస్తూ  ఆటోమ్యుటేషన్‌ చేయడం లేదు. అయితే రెవెన్యూ అధికారులు రకరకాల కారణాలతో వివాదాస్పద భూములను జాబితాలు మారుస్తుంటారు. ఆ విషయం అప్‌డేటెడ్‌గా రిజిస్ట్రార్లకు అందించడం లేదు. దాంతో తప్పులు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది.

- ఏదైనా భూమికి 1-బి రిజిష్టర్‌ ఉంటే...దానిని నిరభ్యంతరంగా రిజిష్టర్‌ చేసుకోవచ్చు. అభ్యంతర పెట్టడానికి వీల్లేదు. అయితే అదే భూమి 22-ఏలో వుందని తహసీల్దార్లు ఆటోమ్యుటేషన్‌ చేయడం లేదు. 22-ఏలో కొత్తగా ఏ భూమిని చేర్చినా సమాచారం జిల్లా రిజిస్ట్రార్‌ ద్వారా ఆ ఏరియా సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపాలి. అది జరగడం లేదు. 

- కొత్తగా తహసీల్దార్లు ఆ ఆస్తికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు కూడా కావాలని పెండింగ్‌ పెడుతున్నారు. ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ‘లింక్‌ డాక్యుమెంట్‌ ప్రావిజన్‌’ లేదు. దాంతో సబ్‌ రిజిస్ట్రార్లు వాటిని పంపలేని పరిస్థితి.

- ఎక్కువ విస్తీర్ణం రాసుకున్నారని కొన్ని మ్యుటేషన్‌ చేయకుండా ఆపేస్తున్నారు. ఏదైనా సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందో 1-బి రిజిష్టర్‌లో ఉంటుంది. అంతకు మించి నమోదుచేస్తే సాఫ్ట్‌వేర్‌ తీసుకోదు. అందులో ఎక్కువ వుందని భావిస్తే...రెవెన్యూ అఽధికారుల దగ్గర వుండే ఆర్‌ఓఆర్‌ (రైట్స్‌ ఆఫ్‌ రికార్డ్‌) పరిశీలించి 1-బి రిజిష్టర్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఆ సమస్య పరిష్కారం కూడా రెవెన్యూ దగ్గరే ఉంది. 


పరిష్కరించకుండా ఎలా...?

ఎక్కడైనా భూ వివాదాలు వస్తే...రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖపైకి నెట్టేస్తున్నారు. ఇప్పటికీ 22-ఏ జాబితాలు పూర్తిగా ఇవ్వని తహసీల్దార్లు ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వ భూమి ఏది అనేది రెవెన్యూ అధికారులే నిర్ణయించాలి. కానీ విచిత్రం జిల్లా రెవెన్యూ అధికారులు...22-ఏ జాబితాలు సబ్‌ రిజిస్ట్రార్లు ఇవ్వాలని అడుగుతుంటారు. మీ దగ్గర ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారే తప్ప...ఇదిగో...కొత్త జాబితాలు...వీటి ప్రకారం ముందుకు వెళ్లండి అని మాత్రం చెప్పడం లేదు. 


Advertisement
Advertisement