దర్జాగా ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల కబ్జా

ABN , First Publish Date - 2021-08-24T07:08:04+05:30 IST

శ్రీకాళహస్తిలో భూ బకాసురులు చెలరేగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

దర్జాగా ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల కబ్జా
వడ్డికండ్రిగ చెరువు స్థలంలో కట్టిన కట్టడాలు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 23: శ్రీకాళహస్తిలో భూ బకాసురులు చెలరేగిపోతున్నారు. పేదల ముసుగులో ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులను సైతం దర్జాగా ఆక్రమిస్తున్నారు. కాగా, తొట్టంబేడు భూములపైనే అధిక శాతం మంది కన్నుపడింది. అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూడడం కబ్జాదారులకు ఊతమిస్తోంది. పారిశ్రామికంగా శ్రీకాళహస్తి ప్రాంతం అభివృద్ధి చెందడంతో భూముల విలువ బాగా పెరిగింది. ఇటీవల పురపాలక సంఘంలో తొట్టంబేడు పంచాయతీని విలీనం చేశారు. దీంతో ఆ ప్రాంత పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇదే మండలం రామచంద్రాపురం సమీపంలోని వడ్డికండ్రిగ చెరువు కట్ట ప్రాంతాన్ని పలువురు ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేశారు. జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు కాకపోవడంతో ఆక్రమణకు దిగినట్లు చెప్పారు. ఏడాది కాలంగా 18 ఎకరాలున్న వడ్డికండ్రిగ చెరువు స్థలం ఆక్రమణల బారినపడింది. చెన్నై రహదారికి కూతవేటు దూరంలో చెరువు ఉండడంతో భూముల విలువ అధికంగా ఉండడం కబ్జాలకు ఊతమిస్తోంది. 


అన్యాక్రాంతమవుతున్నా చర్యల్లేవ్‌.. 

తొట్టంబేడు మండల పరిఽధిలో భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎకరాల కొద్దీ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పటికే ఈదులుగుంట చెరువు ఆక్రమణల చెరలో చిక్కుకుంది. చెన్నై రహదారి సమీపంలోని పద్మాలయ చెరువు ఆక్రమణకు గురవడం తెలిసిందే. ఈ చెరువు సమీపంలోని పురపాలక సంఘం డంపింగ్‌యార్డునూ కబ్జాదారులు వదల్లేదు. వీటి ఆక్రమణపై పెద్దఎత్తున వివాదం రేగడంతో జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు కూల్చి చెరువు, డంపింగ్‌యార్డు స్థలాల్లో బోర్డులు నాటారు. రెండురోజుల కిందట అయ్యలనాడు చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల స్థలాన్ని పలువురు ఆక్రమించారు. ప్రహరీని కూల్చి ఆ స్థలాన్ని చదును చేయడంపై అధికారులు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఆ మేరకు.. విధులకు ఆటంకం కల్గించి, అసభ్య పదజాలంతో దూషించారంటూ అధికారులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం కూడా పలువురు వడ్డికండ్రిగ చెరువు కట్ట ప్రాంతాన్ని ఆక్రమించారు. పేదల పేరిట రాళ్లు నాటి హద్దులను ఏర్పాటు చేయడం వివాదం రేపుతోంది. ఇకనైనా పురపాలక, రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాలను తొలగించాల్సి ఉంది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. 

Updated Date - 2021-08-24T07:08:04+05:30 IST