దర్జాగా కబ్జా

ABN , First Publish Date - 2022-01-21T07:40:38+05:30 IST

దర్జాగా కబ్జా

దర్జాగా కబ్జా

పంట కాలువనూ వదలని ఎమ్మెల్యే!

కాలువపైనే శాశ్వత కట్టడం

ట్రస్టు పేరుతో భూమి కొనుగోలు

ఇంటితోపాటు కాంప్లెక్స్‌ నిర్మాణం

అధికార పార్టీ ఎమ్మెల్యే బరితెగింపు

ప్రకాశంలో 2 గ్రామాల పరిధిలోని 

పంట పొలాలకు సాగునీటికి సమస్య

గగ్గోలు పెడుతున్న అన్నదాతలు


సాగునీటి వనరుల అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా పంట కాలువను ఆక్రమించేశారు. రెండు గ్రామాల పరిధిలోని భూములకు సాగునీరు అందించే కాలువపై శాశ్వత కట్టడాల నిర్మాణం చేపట్టారు. అదీ తన సొంత ఇంటి నిర్మాణంలో భాగంగా ఈ ఆక్రమణకు పాల్పడటం విశేషం. 


(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తన ఇంటి నిర్మాణం కోసం కాలువను ఆక్రమించిన విషయం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గ పరిధిలోనే తాను సొంతిల్లు నిర్మించుకుంటున్నానని, తాను ఇక నియోజకవర్గానికి చెందిన ప్రజల్లో ఒకరిగానే ఉంటానని తరచుగా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు. సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలోని మద్దిపాడు మండలంలో ఉన్న మల్లవరం గ్రామానికి సమీపంలో గుండ్లకమ్మ ఒడ్డున ఆయన ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఇక్కడ ‘సోనియా చార్లీ గ్లోబల్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టరుగా శాసనసభ్యులు టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఉన్నారు. తొలుత 239బై2 సర్వే నెంబరులోని 2.38 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత సర్వే నెంబరు 69బై1, 69బై3లో 3.85 ఎకరాల భూమిని కొన్నారు. ఈ భూమికి తోడు గుండ్లకమ్మ ప్రాజెక్టు వైపు కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ముందువైపు పంటకాలువను ఆక్రమించి నిర్మాణం చేపడుతుండడంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆయన ఇంటి నిర్మాణం మూడు భాగాలుగా జరుగుతోంది. నిర్మాణానికి వెల్లంపల్లి, తాళ్లూరు రహదారికి మధ్యలో పంటకాలువ ఉంది. పూర్వం ఆ ప్రాంతంలో గుండ్లకమ్మ ఆధారంగా నిర్వహించిన ఎత్తిపోతల పఽథకాల సాగునీటి కోసం కాలువ ఏర్పాటు చేశారు.  


కాలువలపై నిర్మాణాలా?

జలవనరుల నిబంధనల ప్రకారం పంట కాలువలకు రెండు వైపులా నిర్ణీత ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు. అయితే, గుండ్లకమ్మ ప్రాజెక్టు కాలువను ఆనుకుని నిర్మాణాలు చేపట్టిన ఎమ్మెల్యే చివరకు కాలువ ఆక్రమణకే దిగారు. తొలుత ఇంట్లోకి వెళ్లే రహదారి వరకు కాలువకు కింద పైపులైను వేస్తారని రైతులు భావించారు. అయితే ఆయన ప్రస్తుతం రూటు మార్చి ఇంటి నిర్మాణాన్ని మూడు భాగాలు చేసి ఒకవైపు భాగంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా నిర్మిస్తున్నారు. దీంతో కాలువను మొత్తంగా ఆక్రమించేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 500లకు పైగా అడుగుల సాగునీటి కాలువను ఆక్రమించారని రైతులు అంటున్నారు. దీంతో ఈ కాలువ కింది ఉన్న కొలసనకోట, వెల్లంపల్లి గ్రామాల్లో పంటలకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు. కొలసనకోట, వెల్లంపల్లి గ్రామాల పరిధిలోని పంట పొలాలకు మోటర్ల ద్వారా నీటిని మళ్లించుకుని ఆరుతడి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా కాలువలకు సక్రమంగా నీళ్లు ఇవ్వకపోయినప్పటికీ భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు ఆ ప్రాజెక్టు నీరే ప్రధాన వనరుగా మారనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పంట కాలువ ఆక్రమణను కొలసనకోట, వెల్లంపల్లి గ్రామాల పరిధిలోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు గ్రామాల్లోని అధికార వైసీపీకి చెందిన కొందరు రైతులు సమస్య తీవ్రతను ఎమ్మెల్యేకు వివరించినట్టు తెలిసింది. దీంతో అటు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కాలువపై భాగంలో కట్టడం నిజమైనప్పటికీ నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా పైపుల నిర్మాణం చేపట్టినట్టు రైతులకు సర్దిచెబుతున్నారు. అయితే.. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2022-01-21T07:40:38+05:30 IST