చెర‘బట్టి’

ABN , First Publish Date - 2021-07-28T04:37:47+05:30 IST

చెర‘బట్టి’

చెర‘బట్టి’
సుబలయిలో ఊటబట్టిని ఆక్రమించి చదును చేసిన దృశ్యం

- సుబలయిలో కబ్జాకు గురైన ఊటబట్టి

- ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్న వైనం

- పట్టించుకోని అధికారులు

(హిరమండలం)

జిల్లాలో ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. పల్లె.. పట్నం తేడా లేకుండా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులే కాదు.. కాలువలు సైతం ఆక్రమణదారుల చెరలో చిక్కి శల్యమవుతున్నాయి. తాజాగా హిరమండలంలోని సుబలయ గ్రామంలో ‘రియల్‌ కబ్జా’ బయటపడింది. ఇక్కడి ఊటబట్టిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి.. చదును చేసి ప్లాట్లు వేశారు. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కూడా అడ్డగోలు రిజిస్ర్టేషన్లు చేసి.. వాటిని విక్రయిస్తున్నారు. బట్టి ఆక్రమణతో తమకు ముంపు ముప్పు తప్పదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

 హిరమండలంలో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు, సాగునీటి కాలువలు, ఆర్‌అండ్‌బీ స్థలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. తాజాగా వీరి కన్ను సుబలయి గ్రామంలోని ఊట బట్టి(కాలువ)పై పడింది. ఎంచక్కా ఈ బట్టిని మట్టితో కప్పేసి ప్లాట్లుగా మార్చేశారు. సర్వే నంబరు 193/3, 4, 5లో ఊటబట్టి విస్తరించి ఉంది. సుబలయి గ్రామంలోని వృథా నీరంతా ఈ బట్టిగుండా వెళ్లి వంశధార కుడి కాలువలో కలిసేలా చాలా ఏళ్ల కిందట దీన్ని తవ్వారు. దీనిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నుపడింది. ఇప్పటికే గ్రామ కార్మిల్‌ పాఠశాల పక్కన ఉన్న పంట పొలాలను ప్లాట్లుగా మార్చాడు. ఇది చాలదన్నట్లు ఊట కాలువను ఆక్రమించి చదును చేయించాడు. ప్లాట్లుగా మార్చేసి ఒక్కొక్కటి రూ.4 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేసినా... ఆయన పట్టించుకోవడం లేదు. కబ్జాదారుడికి రాజకీయ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


ముంపు ముప్పు

ఊట బట్టిని ఆక్రమించి.. సగానికిపైగా చదును చేయడంతో చిన్న పాయిలా మారింది. దీంతో గ్రామంలో వృథానీరు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. ఊట నీరు సక్రమంగా వెళ్లి కాలువలో కలవకపోతే పంట పొలాలు, ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


అనుమతులు లేకుండా ప్లాట్లు

హిరమండలంలో వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా సుమారు 10వేల కుటుంబాలు గ్రామాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. వారిలో కొంతమంది పునరావాస కేంద్రాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొంత మంది స్థలాలు కొనుగోలు చేసుకొని గృహాలు నిర్మించుకుంటున్నారు. దీంతో హిరమండలంలో ఇళ్ల స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఇదే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. కొంతమంది పంట పొలాలను కొనుగోలు చేసి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. మరికొంత మంది  అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు, కాలువలు కబ్జా చేస్తున్నారు.  ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.  


అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు

కొంతమంది రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ సిబ్బంది సహకారంతో స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ స్థలాలు, పంట భూములను అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్లు సక్రమంగా లేకపోయినప్పటికీ సమీపంలోని ప్రైవేట్‌ స్థలాలను కొనుగోలు చేసి లేఅవుట్లగా మార్చుతున్నారు. ఆ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌ చేయించేస్తున్నారు. ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన అనేక మంది రూ.లక్షల్లో నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి.


లేఖ రాశాం 

హిరమండలంలో లే అవుట్లకు పంచాయతీ అనుమతులు లేవని, ప్లాట్లు రిజిస్ర్టేష్లు నిలిపివేయాలని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి లేఖ రాశాం. సుబలయి గ్రామం వద్ద ఊటబట్టిని ఆక్రమించి.. చదును చేసిన షావుకారి విశ్వనాథంకు రిజిస్ర్టార్‌ పోస్టులో నోటీసులు పంపించాం. 

 - నర్సింగరావు, ఇన్‌చార్జి ఈవో, హిరమండలం

 

Updated Date - 2021-07-28T04:37:47+05:30 IST