మత్స్యశాఖ భూములపై కబ్జాదారుల కన్ను

ABN , First Publish Date - 2021-10-21T06:01:18+05:30 IST

జిల్లా కేంద్రంలోని కోట్ల రూపాయల విలువైన భూములపై కబ్జాదారులు కన్నువేశారు. అర్సపల్లిలోని మత్స్యశాఖ కార్యాలయానికి చెందిన భూమి కాజేసేందుకు కబ్జాదారులు విఫలయత్నం చేస్తున్నారు. మత్స్యశాఖకు చెందిన దాదాపు ఎకరన్నర స్థలం కాజేసేందుకు

మత్స్యశాఖ భూములపై కబ్జాదారుల కన్ను
కబ్జాకు యత్నిస్తున్న ఎకరంన్నర స్థలం ఇదే ..

తప్పుడు సర్వే నెంబర్‌లతో ఆక్రమణలకు యత్నం

ఎకరం స్థలం కాజేసేందుకు విఫలయత్నం

కోర్టుకెక్కిన ఆక్రమణదారులు

అనుకూలంగా  సర్వేయర్‌  రిపోర్ట్‌

రెండ్రోజుల క్రితం మళ్లీ కబ్జాకు యత్నం 

నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 20: జిల్లా కేంద్రంలోని కోట్ల రూపాయల విలువైన భూములపై కబ్జాదారులు కన్నువేశారు. అర్సపల్లిలోని మత్స్యశాఖ కార్యాలయానికి చెందిన భూమి కాజేసేందుకు కబ్జాదారులు విఫలయత్నం చేస్తున్నారు. మత్స్యశాఖకు చెందిన దాదాపు ఎకరన్నర స్థలం కాజేసేందుకు దొంగ సర్వే నెంబర్లు సృష్టించి సదరు స్థలం తమదేనంటూ కోర్టుకెక్కడం గమనార్హం. జిల్లా కోర్టు రెండుసార్లు మత్స్యశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చానా.. వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వారికి చుక్కెదురైనా ఆగడం లేదు. వాటిపై రివిజన్‌ పిటిషన్‌ వేసి అధికారులను కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. 

ఫ 6.26 ఎకరాలలో మత్స్యశాఖ కార్యాలయం

జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో మత్స్యశాఖకు గతంలో ప్రభుత్వం 6 ఎకరాల 26 గుంటల స్థలం కేటాయించింది. ఇట్టి స్థలం క్రమంగా కబ్జాకు గురై చివరకు 4ఎకరాల 24 గుంటల స్థలం మాత్రమే మిగిలింది. కార్యాలయం ఎదురుగా బోధన్‌కు వెళ్లే ప్రధాన రహదారి, వెనుక, చుట్టుపక్కల భాగాల్లో ఖరీదైన ఇళ్లు, వాణిజ్య స్థలాలున్నాయి.  ఈ స్థలంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం, ఫిషరీస్‌ ఆధికారి కార్యాలయం ఉన్నాయి. వాటితో పాటు ఈ విశాలమైన స్థలంలో చేపలు పెంచేందుకు నాలుగు పెద్ద ఫిష్‌ పాండ్స్‌ కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు చేప పిల్లలు ఇక్కడే పెంచేవారు. నీటి ఎద్దడి కారణంగా చేప పిల్లలు పెంపకం నిలిపివేయడంతో అవి శిథిలావస్థకు చేరాయి. కార్యాలయం వెనుక భాగం కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో ఈ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తోంది. సర్వే నెంబర్‌ 2848, 2849లలో 4ఎకరాల 24 గుంటల స్థలం ఉంది. అందులో సర్వే నెంబర్‌ 2848లో ఒక ఎకరం 11 గుంటలు, సర్వే నెంబర్‌ 2849లో 3ఎకరాల 13 గుంటల స్థలం ఉంది. ఈ స్థలంలో అహ్మద్‌, షాజహానా బేగం అనే వారు 23 గుంటల స్థలం తమదేనని జిల్లా కోర్టును ఆశ్రయించారు. వీరి వానదలను కోర్టు కొట్టివేసింది. వారు సెషన్‌ కోర్టుకు వెళ్లినా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని కేసు కొట్టివేస్తూ ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిం చాలని ఆదేశించగా.. ప్రహరీ సగం మాత్రమే నిర్మించి వదిలివేశారు. దీంతో కబ్జాదారులు తరచూ ఈ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని అధికారులు, పోలీసులు తొలగిస్తున్నా మళ్లీమళ్లీ అదే పని చేస్తున్నారు. 

ఫ సర్వేయర్‌ తప్పుడు సర్వే

మత్స్యశాఖకు చెందిన భూమిని సర్వే చేయాలని అధికారులు ఏడీ జిల్లా సర్వేయర్‌ను కోరారు. దాంతో 01.11.2019న జిల్లా సర్వేయర్‌, మండల సర్వేయర్‌లు కలిసి సర్వే చేసి 4 ఎకరాల 24 గుంటల స్థలం మత్స్య శాఖకు చెందినదేనని నివేదిక ఇచ్చారు. కోర్టులో కేసు విచారణకు మత్స్యశాఖ అధికారులు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కబ్జాదారులు నార్తు మండల సర్వేయర్‌ అరుణ కు తమ భూమి చూపించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అప్పటి నార్తు మండల సర్వేయర్‌ అరుణ 23.07.2020న జిల్లా మత్స్యశాఖ అధికారులకు స మాచారం ఇవ్వకుండా ఎవరూ లేని సమయంలో సర్వేచేసి కబ్జాదారులకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. జిల్లా సర్వేయర్‌ ఇచ్చిన నివేదికతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సదరు స్థలం వారిదేనని నివేదిక ఇవ్వడం వివాదం అయ్యింది. ఈ నివేదికపై ఎఫ్‌డీవో ఆంజనేయస్వామి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాగా.. విచారణ జరిపి సర్వేయర్‌ను సస్పెండ్‌ చేశారు. 

ఫ తప్పుడు సర్వే నెంబర్లతో వాదన

మత్స్యశాఖ కార్యాలయం మొత్తం 6ఎకరాల 26 గుంటలు స్థలం 2848, 2849లలో ఉంది. అయితే  కబ్జాదారులు మాత్రం 2851 నెంబర్‌ గల సర్వే నెంబర్‌ స్థలం మత్స్యశాఖ కార్యాలయంలో ఉందని వాదిస్తున్నారు. 2016-17 పహానీ ప్రకారం ఆ స్థలంలో కోళ్ల ఫారం, ఆయిల్‌మిల్‌ ఉన్నట్లు ఉంది. మత్స్య శాఖ కార్యాలయంలో లేని సర్వేనెంబర్లు సృష్టిస్తూ, తప్పడు కేసులు నమోదుచేస్తున్నారని అధికారులు వాపోతున్నారు. అసలు లేని సర్వే నెంబర్లలో స్థలం ఉందనే వాదనే తప్పని కోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఫ చట్టం ప్రకారం ముందుకెళ్లాలన్న మంత్రి

కేసు కోర్టులో విచారణ సాగుతోంది. రెండోసారి సర్వేచేసి నివేదిక ఇచ్చిన  సర్వేయర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అయినా మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నారు. ఈ నెల 18న సోమవారం తెల్లవారు జామున ఉదయం 4గంటలకు కొందరు రాళ్లు, సిమెంట్‌ పిల్లర్లు సదరు స్థలంలో పాతే ప్రయత్నం చేశారు. వాచ్‌మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అడ్డుచెప్పడంతో ఆయనను బెదిరించారు. ఆయన వెంటనే ఏడీ ఆంజనేయస్వామికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన ఎఫ్‌డీవోను వెంటనే వెళ్లిపోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆయన కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లకు సమాచారం అందించారు. షకీర్‌ఖాన్‌, ఫైజల్‌ఖాన్‌ అనే వ్యక్తులు సదరు స్థలంలో రాళ్లు, సిమెంట్‌ పిల్లర్లు నాటేందుకు యత్నించారు. ఘటనాస్థలికి వెళ్లాలని అదనపు కలెక్టర్‌ పోలీసులకు ఆదేశించడంతో 1వ పట్టణ ఎస్‌హెచ్‌వో, తమ సిబ్బందితో వెళ్లి కబ్జాదారులను వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. దాంతో వారు తమ స్థలంలో పనులు చేసుకుంటే అడ్డుకున్నాడని ఎఫ్‌డీవోపై ఫిర్యాదు చేశారు. వారి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపమని గంట సమయం ఇచ్చినా వారు స్పందించలేదు. దీంతో మత్స్యశాఖ స్థలంలో కబ్జాకు యత్నిస్తున్నారని ఎఫ్‌డోవో ఆంజనేయస్వామి 1వ పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా, మత్స్యశాఖ స్థలం కబ్జాకు యత్నిస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఎఫ్‌డీవో ఆంజనేయస్వామిని బుధవారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో చట్టం ప్రకారం ముందుకెళ్లాలని మంత్రి సూచించినట్లు ఎఫ్‌డీవో తెలిపారు.

మత్స్యశాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం

: ఎఫ్‌డీవో ఆంజనేయస్వామి

మత్స్యశాఖకు సంబంధించిన భూముల్లో తరచూ కబ్జాకు యత్నిస్తున్నారు. కేసులు వేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు సర్వేనెంబర్లతో స్థలం తమదని వాదిస్తున్నారు. కబ్జా యత్నంపై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కూడా వివరించాం. చట్టప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కానివ్వం. 

Updated Date - 2021-10-21T06:01:18+05:30 IST