ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను

ABN , First Publish Date - 2020-09-25T06:33:23+05:30 IST

పట్టణ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ, అట్టల ఫ్యాక్టరీ కాలనీల సమీపంలోని ప్రభుత్వ లేఅవుట్‌ల్లో మిగిలిపోయిన క్రాస్‌బిట్లు

ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను

యథేచ్ఛగా ఆక్రమణలు

నకిలీ పట్టాల సృష్టి

పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు


కావలి రూరల్‌, సెప్టెంబరు24: పట్టణ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ, అట్టల ఫ్యాక్టరీ కాలనీల సమీపంలోని ప్రభుత్వ లేఅవుట్‌ల్లో మిగిలిపోయిన క్రాస్‌బిట్లు, పార్కు స్థలాలపై భూ భకాసురుల కన్ను పడింది. పట్టణంలోని నిరుపేదల కోసం 2008, 2010 సంవత్సరాల్లో 4 లేఅవుట్లల్లో సుమారు 6000 మందికి నివేశ స్థలాలు కేటాయించారు. అట్టల ఫ్యాక్టరీ సమీపంలోని 4వ లేఅవుట్‌లో క్రాస్‌బిట్లను, రోడ్డును సైతం ఆక్రమించి వాటికి దొంగ పట్టాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే రైల్వేట్రాక్‌కు సమీపంలో ఉన్న 3వ నెంబరు లే అవుట్‌లో రైల్వేట్రాక్‌కు, లేఅవుట్‌ కాలనీకి మధ్యన పార్కులకోసం సుమారు రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.


రిజర్వులో ఉన్న ఈ స్థలం పై కన్నేసిన కబ్జాదారులు దాన్ని ఆక్రమించటంతో పాటు ఎదురుగా ఉన్న లేఅవుట్‌ కాలనీ వాసులు ఇళ్ల ముందు వేసుకున్న చెట్లను సైతం నరికేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు.  కాలనీలోనే కబ్జాదారులు మకాం ఏర్పాటు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీపట్టాలను సృష్టించి ప్రభుత్వ భూములు కబ్జాచేస్తున్నారు. అయినా రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ పట్టాల సృష్టికర్తలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-25T06:33:23+05:30 IST