రింగురోడ్డు పక్కనే కాలువ కబ్జా..!

ABN , First Publish Date - 2021-01-21T06:01:30+05:30 IST

కబ్జాదారులు కాలువలనూ వదలడం లేదు. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేయడమే కాదు, యథేచ్ఛగా కాలువలు సైతం ఆక్రమించి విక్రయాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. రాత్రింబవళ్లు రింగురోడ్డుకు వెంబడి కాలువను యంత్రాలు పెట్టి పూడ్చేస్తున్నారు.

రింగురోడ్డు పక్కనే  కాలువ కబ్జా..!
సిగ్నల్‌ బోర్డు వద్ద గతంలో ఉన్న కాలువ

వెంచర్లువేసి యఽథేచ్ఛగా విక్రయాలు

కోట్లు చేతులు మారుతున్న వైనం

చోద్యం చూస్తున్న అధికారులు


అది ప్రొద్దుటూరు రింగురోడ్డు. ఆరోడ్డును ఆనుకుని ఉన్న స్థలాలు ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతోంది. దీంతో కబ్జారాయుళ్లు చెలరేగిపోతున్నారు. రోడ్డును అనుకుని ఉన్న మైలవరం ఉత్తర కాలువను కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారు. విచిత్రమేమంటే ఈ కాలువ వైఎస్‌ఆర్‌ హయాంలో కల్లూరు ప్రాంత ప్రజలకు తాగునీటికోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆయన తనయుడి హయాంలో ఆక్రమణలకు గురవుతోంది.


ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 20 : కబ్జాదారులు కాలువలనూ వదలడం లేదు. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేయడమే కాదు, యథేచ్ఛగా కాలువలు సైతం ఆక్రమించి విక్రయాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. రాత్రింబవళ్లు రింగురోడ్డుకు వెంబడి కాలువను యంత్రాలు పెట్టి పూడ్చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉండటంతో అధికారులు కాలువ కబ్జాపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రొద్దుటూరు పట్టణం రింగు రోడ్డును అనుకొని ప్రవహిస్తున్న మైలవరం ఉత్తర కాలువ నుంచి కల్లూరు డిస్ర్టిబ్యూటరి చానల్‌ 2.7 కిలో మీటర్లు పొడవుతో ఉంది. మైలవరం ఉత్తర కాలువ నుంచి మండలంలోని పలు గ్రామాల మీదుగా కల్లూరు వరకు సాగునీరు  అందించాలనే లక్ష్యంతో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం భూసేకరణ చేసి మట్టి కాలువలు తవ్వింది. అయితే కొన్నేళ్లుగా మైలవరం జలాశయం నిండకపోవడంతో ఈ కాలువలకు నీళ్లు పారలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీశైౖలం డ్యాంలో పూర్తి సామర్థ్యంలో నీళ్లు నిలిచాయి. దీంతో క్రిష్ణా జలాలు జీఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా గండికోట జలాశయానికి చేరాయి. గండికోటలో సైతం పూర్తి స్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి మైలవరానికి నీళ్లు వొదిలారు. గతంలోనే మైలవరం ఉత్తర, దక్షిణ కాలువల లైనింగ్‌ దెబ్బతింది. వీటికి మరమ్మతులు లేకపోవడంతో ప్రాజెక్టులోని మిగులు నీటిని సాగునీటి కాలువలకు ఒదలకుండా పెన్నా నదిలోకి వదిలేశారు.

కాలువలకు నీళ్లు పారక పోవడంతో వినియోగంలో లేనిది అదనుగా చూసుకొని కొందరు ఖద్దరు పెద్దలు రంగంలోకి దిగారు. కాలువను పూడ్చి వెంచర్లలో కలిపేసుకున్నారు. ఈ భూములను ప్లాట్లుగా విభజించి సెంటు రూ.10 లక్షల మేర విక్రయాలు జరుపుతున్నారు. బైపాస్‌ రోడ్డుకు పక్కనే కావడంతో ఎకరా రూ.10కోట్ల మేర ధర పలుకుతోంది. ఇప్పటికే కల్లూరు డిస్ర్టిబ్యూటరి చానల్‌ రెండు ఎకరాలమేర కబ్జాకు గురయినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున బైపాస్‌రోడ్డు వెంబడి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని కాలువ కబ్జాకాకుండా చూడాలని కల్లూరు ప్రజలు కోరుతున్నారు.


ఉన్నతాధికారులకు నివేదించాం

- బాలక్రిష్ణారెడ్డి, డీఈ, మైలవరం సబ్‌ డివిజన్‌, ప్రొద్దుటూరు

మట్టి కాలువ కావడంతోబైపాస్‌రోడ్డు వచ్చాక హద్దులు చెరిగిపోయాయి. ఏళ్లుగా కాలువను కబ్జాచేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నోటీసులు ఇచ్చాం, పోలీసు స్టేషన్లలో కేసులు కూడా పెట్టి అడ్డుకుంటూ వచ్చాం. ఇటీవల బైపాస్‌ వెంబడి వెంచర్లు పెరిగిపోయి పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి. మైలవరం ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులకు కాలువ కబ్జాపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాం. కాలువను సర్వే చేయమని రెండేళ్లుగా రెవెన్యూ అధికారులను కోరుతున్నాం. మాకు కేవలం యుటిలైజేషన్‌ అథారిటి తప్ప జ్యుడీషరీ అఽథారిటీ లేదు. జాయింట్‌ ఇనస్పెక్షన చేసి చేసి సర్వే చేద్దామని తహసీల్దారు చెప్పారు.



Updated Date - 2021-01-21T06:01:30+05:30 IST