సముద్రం మనకు ఆదర్శం

ABN , First Publish Date - 2020-04-03T06:46:21+05:30 IST

ఒక సంస్థను నడపాలంటే అన్ని రకాల వ్యక్తులనూ భరించాలి. కావాలనుకున్న విధంగా మనుషులు దొరకరు. అలాగే సంసారం నడవాలన్నా నాలుగు రకాల మనస్తత్వాలనూ భరించడం అలవాటు...

సముద్రం మనకు ఆదర్శం

  • నవజీవన వేదం

ఒక సంస్థను నడపాలంటే అన్ని రకాల వ్యక్తులనూ భరించాలి. కావాలనుకున్న విధంగా మనుషులు దొరకరు. అలాగే సంసారం నడవాలన్నా నాలుగు రకాల మనస్తత్వాలనూ భరించడం అలవాటు చేసుకోవాలి. అందరినీ మార్చాలని చూడవద్దు. మారరు. అలా మార్చడం కూడా సాధ్యం కాదు. మరి మారని మనస్తత్వాలతో సంసారం ఎలా? సంస్థ నిర్వహణ ఎలా? పరిపాలన ఎలా? అంటే భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా ఆ ఉపాయమేంటో తెలుసుకుందాం. సముద్రతీరంలో నిలుచుని కాస్తలోతుగా ఆలోచించండి. సముద్రం ఎంత విచిత్రమైనదో, ఎన్నిటిని భరిస్తుందో అర్థమవుతుంది.


  • ఒక యెడ బవ్వళించు హరి, యొక్క యెడన్‌ వహియించు రాక్షస
  • ప్రకరము, లొక్కచో నడగు బర్వత సంఘము, లొక్కెడన్‌ బలా
  • హకములతోడ నుండు బడబాగ్నియు, విస్తృత మూర్జితంబునుం 
  • బ్రకటభరక్షమం బగుచు భాసిలు నౌర సముద్ర మెంతయున్‌

శ్రీహరి సముద్రంలో పవళిస్తాడు. మరి భగవంతుడు పవళించాడు కాబట్టి ఇంకెవరూ లేరా? అంటే...రాక్షసులూ సముద్రంలోనే దాక్కున్నారు. అంతేకాదు మందర పర్వతంలాంటి కొన్ని వందల పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి. మేఘాలు ఏర్పడటానికి సముద్రమే కారణం. బడబాగ్నిని భరిస్తున్నదీ సముద్రమే! విష్ణుమూర్తిలాగే సముద్రం ఎంత విశాలమైన హృదయం కలిగి ఉంది. అలాంటి సముద్రాన్ని చూసి నేర్చుకుందాం! సంస్థలో పర్వతాల లాంటి వాళ్లుంటారు. వాళ్లను పోషించడం కూడా కష్టమే. బడబాగ్ని లాంటి వాళ్లూ ఉంటారు. యజమానినే కాల్చుకు తింటారు. రాక్షసులు ఉంటారు. పని రాక్షసులూ ఉంటారు. జీవితమైనా, సంసారమైనా, సంస్థయినా నాలుగు రకాల వ్యక్తులనూ భరించాలి.

-డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-04-03T06:46:21+05:30 IST