కడలి కన్నెర్ర

ABN , First Publish Date - 2020-09-21T07:53:51+05:30 IST

బంగాళాఖాతం సముద్ర తీరం కన్నెర్ర చేస్తోంది. హద్దులను చేరిపేస్తూ జనావాసాల మధ్యకు చొచ్చుకు వస్తోంది. పౌర్ణమి, అమావాస్యలకు పోటెత్తే సముద్రం ఇప్పుడు

కడలి కన్నెర్ర

తరచూ ఊళ్లను ముంచేస్తున్న సముద్ర అలలు

ఎస్‌.యానాంలో సముద్ర తీరానికి సైతం గండి

రానున్న జలప్రళయానికి సంకేతమా!

చెరువులు, ఇసుక అక్రమ తవ్వకాల వల్లే  ఈ పరిస్థితి

ఆందోళనలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతం సముద్ర తీరం కన్నెర్ర చేస్తోంది. హద్దులను చేరిపేస్తూ జనావాసాల మధ్యకు చొచ్చుకు వస్తోంది. పౌర్ణమి, అమావాస్యలకు పోటెత్తే సముద్రం ఇప్పుడు నిత్యం ఉరకలు వేస్తూ ఊళ్లలోకి వచ్చేస్తోంది. భవిష్యత్తులో జల ప్రళయాలకు ఇవి సంకేతాలంటూ తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల వ్యవధిలో సముద్రం అల్లకల్లోలమవుతూ ఉప్పొంగి తీర గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావం వల్ల సముద్రంలో అలజడి ఉత్పన్నమై ఇలా జరుగు తుందని మత్స్యకార గ్రామాల ప్రజలు చెప్పుకొస్తున్నారు. సముద్ర తీరాన్ని ఇసుక కోసం ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో పాటు కూతవేటు దూరంలోనే భారీగా రొయ్యలు, చేపల చెరువుల తవ్వకాల వల్ల తీర ప్రాంతంలో ఉన్న ఇసుక మేటలు తరిగిపోయి చొచ్చుకు వస్తుందంటూ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా తీరం వెంబడి గ్రామాల్లో ‘అల’జడి తీవ్రమైంది. అంతర్వేది సమీపం లో తీరం వెంబడి ఉన్న అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లిపాలెం, కేశవదాసు పాలెం గ్రామాల్లోకి సముద్రం తరచూ చొచ్చుకొచ్చింది. సరుగుడు తోటలు, కొబ్బరితోటలతో పాటు  పంట పొలాలు సైతం ఉప్పునీటి బారినపడి రైతులు నష్టపోతున్నారు.


కెరటాల తాకిడికి తీరం వెంబడి ఉన్న సరుగుడు, కొబ్బరి చెట్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకాలు, ఇసుక అక్రమ తవ్వకాలు వంటి పరిస్థితుల వల్ల ఈ తరహా ముంపు తీవ్రమవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేదిపల్లిపాలెంలో సునామీ కాలనీతో పాటు పలు వీధుల్లోకి ఉప్పునీటి కెరటాలు చొచ్చుకురావడంతో కొన్ని రోజులుగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. కేశనపల్లి, కరవాక, ఓడలరేవు, కొమరగిరిపట్నం, రామేశ్వరం, వాసాలతిప్ప, ఎస్‌.యానాం, చిర్రయానాం వంటి తీర గ్రామాల్లో విలువైన భూములు సైతం కెరటాల తాకిడికి కనుమరుగవుతున్నాయి. ఇటీవల వచ్చిన సముద్ర కెరటాలకు ఎస్‌.యానాం బీచ్‌ తీరం కోతకు గురై పెద్ద గండి పడింది. దాంతో నీరంతా సమీపంలోని రొయ్యల చెరువులతో పాటు ఊళ్లలోకి వచ్చేయడంతో ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుండడంతో సముద్ర తీరం వెంబడి నలభై గ్రామాలకు పైగా ఉన్న ప్రజలు భయకంపితులవుతున్నారు. ఇసుక, రొయ్యల చెరువుల తవ్వకాల వల్లే తీరం గుల్ల అయి సముద్రాన్ని ముందుకు ఆహ్వానిస్తున్నట్టు అవుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంబడి జరుగుతున్న అక్రమ తవ్వకాలను నిరోధించకపోతే భవిష్యత్తులో కొన్ని గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 

Updated Date - 2020-09-21T07:53:51+05:30 IST