ఓసీఐ కార్డు హోల్డర్లకు.. యూఎస్‌లోని భారత ఎంబసీ కీలక సూచన !

ABN , First Publish Date - 2021-03-30T15:27:25+05:30 IST

అమెరికాలోని భారత ఎంబసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓసీఐ కార్డు హోల్డర్లకు కీలక సూచన చేసింది.

ఓసీఐ కార్డు హోల్డర్లకు.. యూఎస్‌లోని భారత ఎంబసీ కీలక సూచన !

వాషింగ్టన్: అమెరికాలోని భారత ఎంబసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓసీఐ కార్డు హోల్డర్లకు కీలక సూచన చేసింది. భారతీయులు ఎవరైతే ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు కలిగి ఉన్నారో.. వారు ఇకపై స్వదేశానికి ప్రయాణించేటప్పుడు తమతో పాటు పాత, గడువు ముగిసిన పాస్‌పోర్టులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఎంబసీ తన వెబ్‌సైట్‌ ద్వారా ఈ ప్రకటన చేసింది. అయితే, కొత్త పాస్‌పోర్టులను తీసుకెళ్లడం తప్పనిసరి అని పేర్కొంది. 20 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారు ఓసిఐ కార్డు పొందే గడువును భారత ప్రభుత్వం 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఈ సందర్భంగా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, 2005 నుండి అమలులో ఉన్న ప్రస్తుత ఓసీఐ మార్గదర్శకాల ప్రకారం, కార్డ్‌హోల్డర్ 20 సంవత్సరాల వయస్సు వరకు లేదా 50 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత కొత్త పాస్‌పోర్ట్ పొందిన ప్రతిసారీ ఓసీఐ కార్డు తిరిగి జారీ చేయవలసి ఉంటుంది. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధనలో కేంద్రం స్పల్ప మార్పులు చేసింది. 

Updated Date - 2021-03-30T15:27:25+05:30 IST