ఆండాళ్‌ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ

ABN , First Publish Date - 2021-01-16T06:38:08+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారికి సంప్రదాయ రీతిలో ఒడి బియ్యాన్ని భక్తులు సమర్పించారు.

ఆండాళ్‌ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ
ఒడిబియ్యం సమర్పిస్తున్న ఆలయ ఈవో గీతారెడ్డి

యాదాద్రి టౌన్‌, జనవరి 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారికి సంప్రదాయ రీతిలో ఒడి బియ్యాన్ని భక్తులు సమర్పించారు. 30రోజులపాటు ఆండాళ్‌ అమ్మవారి శ్రీరంగనాఽథుడిని చేరుకునేందుకు చేపట్టిన తిరుప్పావై వ్రతం చివరి రోజు గోదా రంగనాథుల కల్యాణ వేడుకలు జరిగిన మరుసటి రోజు గురువారం అమ్మవారిని ఆరాధిస్తూ ఒడి బియ్యం సమర్పించడం యాదాద్రి క్షేత్రంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ విశేష వేడుకల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి దంపతులు, స్థానికులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామిని గురువారం తెలంగాణ రాష్ట్ర స్టాంప్స్‌, అండ్‌ రిజిస్ర్టేషన్‌ కమిషనర్‌ చిరంజీవులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామికి గురువారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.9,93,686 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

 నేత్రపర్వంగా అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం 

 యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. కాగా స్వామిని శుక్రవారం భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదు, నగల లెక్కింపులను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. స్వామికి శుక్రవారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.11,64,608 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T06:38:08+05:30 IST