ధర్మారణ్యంలో కర్మసాక్షి

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

‘‘మొధెరాలోని అపూర్వమైన సూర్య దేవాలయం ఒక వర్షాకాలం రోజున అద్భుతంగా కనిపిస్తోంది’’ అంటూ కిందటి ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది....

ధర్మారణ్యంలో కర్మసాక్షి

సూర్య దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది ఒడిశాలోని కోణార్క. అయితే గుజరాత్‌లోని మొధెరా సూర్యాలయం కూడా కోణార్క మాదిరిగానే శిల్ప సౌందర్యానికి చిరునామా. 


‘‘మొధెరాలోని అపూర్వమైన సూర్య దేవాలయం ఒక వర్షాకాలం రోజున అద్భుతంగా కనిపిస్తోంది’’ అంటూ కిందటి ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. రాతి మెట్ల వరుసల మీదుగా వర్షపు నీరు జలపాతాల్లా జారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నిజానికి గుజరాత్‌లోని మొధెరా సూర్య దేవాలయం వెయ్యేళ్ళుగా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఎందరినో ఆకర్షిస్తూనే ఉంది. 


చాళుక్య రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు ఈ ఆలయాన్ని క్రీస్తుశకం పదకొండో శతాబ్దంలో నిర్మించాడు. పుష్పావతి నదీ తీరాన... గర్భగుడి ఉన్న ప్రధాన ఆలయ భవనం, సభామంటపం, స్నాన కుండం అనే మూడు భాగాలుగా ఈ ఆలయ సముదాయం నిర్మితమయింది. ఈ ప్రాంత ప్రస్తావన స్కాంద, బ్రహ్మ పురాణాల్లో ఉందనీ, ‘ధర్మారణ్యం’గా అప్పట్లో దీన్ని పిలిచేవారనీ స్థల పురాణం చెబుతోంది. దాని ప్రకారం, రావణాసురుణ్ణి శ్రీరాముడు వధించాక, బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి చెందే మార్గం చెప్పాల్సిందిగా తన గురువైన వశిష్టుణ్ణి కోరుతాడు. పుణ్యప్రదమైన ధర్మారణ్యంలో కొంతకాలం ఉండి, సూర్యుణ్ణి పూజిస్తే దోషవిముక్తి కలుగుతుందని వశిష్టుడు చెబుతాడు. శ్రీరాముడు ఇక్కడ సూర్యారాధన చేసి, బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడ్డాడట!  


రోజూ సూర్యుడి తొలి కిరణాలు గర్భగుడిలోకి వచ్చేలా ఈ ఆలయ నిర్మాణం జరగడం నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడానికి సుమారు పన్నెండేళ్ళపాటు వందలాది శిల్పులు శ్రమించారు. ఈ నిర్మాణంలో ఎక్కడా సున్నాన్ని ఉపయోగించలేదు. గర్భగుడికి కొంచెం దూరంలో ఉన్న సభా మండపంలో 52 స్తంభాలు ఉంటాయి. వీటిని సంవత్సరంలోని  52 వారాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడి గోడల మీద సూర్యుడి చిత్రాల్లో పంచభూతాలతో సమన్వయం కనిపిస్తుంది. గర్భగుడి 52 అడుగుల పొడవు, 26 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ మూడు భాగాల్లోనూ చాళుక్య శైలి శిల్పకళా చాతుర్యం ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది. గర్భ గుడి ఉన్న సముదాయం నుంచి సభా మంటపానికీ, అక్కడి నుంచి కుండానికీ దారులు ఉన్నాయి.


కుండం ఉన్న ప్రాంతం చాలా విశాలంగా కనిపిస్తుంది. కుండం చుట్టూ దాదాపు 150 పైగా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. చుట్టూ చెట్లు, పచ్చదనం సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. మహమ్మదీయుల కాలంలో జరిగిన దాడుల్లో ఈ ఆలయంలో చాలా భాగం దెబ్బతింది. మొధెరా సూర్య దేవాలయంలో ఇప్పుడు పూజలు జరగడం లేదు. ప్రస్తుతం పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న ఈ ఆలయాన్ని 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది.



Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST