పరుగో. .. పరుగు!

ABN , First Publish Date - 2021-05-10T13:39:03+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో బెంబేలెత్తుతున్న నగరవాసులు మెడికల్‌ స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. తేలికపాటి జ్వరం

పరుగో. .. పరుగు!

మెడికల్‌ స్టోర్లకు తరలుతున్న జనం.. పెద్ద ఎత్తున మందుల కొనుగోలు 

లక్షణాలు ఉన్నా.. లేకున్నా గోళీల వాడకం 

ధరలు పెంచేస్తున్న దుకాణ యజమానులు 

నగరవాసులను వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ 


హైదరాబాద్‌ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో బెంబేలెత్తుతున్న నగరవాసులు మెడికల్‌  స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. తేలికపాటి జ్వరం వచ్చినా... గట్టిగా రెండుసార్లు తుమ్మినా.. కొద్దిగా గొంతు నొప్పి ఉన్నా.. కరోనా సోకిందనే భయంతో సమీపంలోని మందుల దుకాణాలకు వెళ్తున్నారు. తెలిసిన మందులు వేసుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో నగరంలోని పలు దుకాణాల్లో వివిధ గోళీలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజుకు వేలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. అయితే గతంలో కరోనా పరీక్ష చేయుంచుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చిన బాధితులు మాత్రమే హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు మందులు వేసుకునేవారు. కాగా, ప్రస్తుతం నగరంలో కరోనా టెస్టుల కోసం కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతున్నా అందరికీ పరీక్షలు చేయడం లేదు. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు ఉన్నవారు నేరుగా మందుల దుకాణాలకు వెళ్తూ తమకు తెలిసిన డాక్టర్ల సలహాతో మందులు కొనుగోలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇంటిలో ఎవరైనా కొవిడ్‌తో ఇబ్బంది పడుతుంటే మిగతా వారంతా కూడా బాధితుడు వేసుకునే మందులను వాడుతున్నారు. 


ఈ గోళీలకు భారీ డిమాండ్‌

కరోనా మొదటి దశ సమయంలో పాజిటివ్‌ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేసింది. ఇందులో జ్వరానికి పారాసిటమిల్‌, గొంతు నొప్పికి అజిత్రోమైసిన్‌, జలుబుకు లివోసిట్రజిన్‌, సీ-విటమిన్‌కు లిమ్సీ, జింక్‌, డీ విటమిన్‌ ట్యాబెట్లను ఇచ్చింది. అయితే ప్రస్తుతం రెండో దశ పంజా విసిరిన నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న చాలామంది డోలో-650, డ్యాక్సీటీ-100 ఎంజీ, ఐవర్‌మెక్టిన్‌-12 ఎంజీ, లివోసెట్‌-5 ఎంజీ తీసుకుంటున్నారు. వీటితోపాటు ఆస్కజెనిక్‌ 50 ఎంజీ, లిమ్సీ, జింకోవిట్‌, వీఐటీడీ-3 (డీ విటమిన్‌) ట్యాబెట్లను తీసుకుంటున్నారు. కాగా, వీటిని కొందరు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటుండగా, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూసి నేరుగా కొనుగోలు చేస్తుండడంతో కాలనీలు, బస్తీల్లోని దుకాణాల్లో ఈ గోళీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. పాజిటివ్‌ నిర్ధారణ కాకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని ప్రభుత్వం, డాక్టర్లు పదేపదే చెబుతున్నా కొంతమంది అతిజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. వైరస్‌ తీవ్రత పెరిగితే రానున్న రోజుల్లో ఈ మందులు లభించవనే అపనమ్మకంతో వీరంతా అసలు బాధితులకు మందులు దొరకకుండా చేస్తున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు.


ధరల దోపిడీ 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఆసరాగా చేసుకుని మందుల దుకాణాల యాజమానులు ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ఉదాహరణకు డోలో 650 మార్కెట్‌లో 15 గోళీలకు రూ.30.75 పైసలు ఉండగా, కొన్ని దుకాణాల్లో రూ.34 తీసుకుంటున్నారు. అలాగే జింకోవిట్‌ 10 ట్యాబ్లెట్లకు రూ.102 ధర ఉండగా, రూ.110 తీసుకుంటున్నారు. ఇలా స్వల్ప కొవిడ్‌  లక్షణాలను అరికట్టేందుకు దోహదపడే  మందులను కొందరు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతుండడంతోపాటు మరికొందరు అదే రకం మందు కలిగిన ఇతర కంపెనీల ట్యాబెట్లను అంటగడుతూ ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-05-10T13:39:03+05:30 IST