అద్భుతాల ‘గడ్డిపోచ’

ABN , First Publish Date - 2020-11-23T02:11:42+05:30 IST

అత్తిపత్తి ఆకులు (టచ్‌ మీ నాట్‌) ముట్టుకోగానే ముడుచుకుంటాయని అందరికీ తెలుసు. కానీ చలనం ఉన్న గడ్డిపోచను ఎప్పుడైనా చూశారా? తడి తగిలినపుడు ఆ గడ్డిపోచ గడియారంలో ముల్లులా గిరగిరా తిరుగుతుంది. ప్రస్తుతం పరిశోధనల దశలో...

అద్భుతాల ‘గడ్డిపోచ’

అత్తిపత్తి ఆకులు (టచ్‌ మీ నాట్‌) ముట్టుకోగానే ముడుచుకుంటాయని అందరికీ తెలుసు. కానీ చలనం ఉన్న గడ్డిపోచను ఎప్పుడైనా చూశారా? తడి తగిలినపుడు ఆ గడ్డిపోచ గడియారంలో ముల్లులా గిరగిరా తిరుగుతుంది. ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న ఈ అరుదైన గడ్డిపోచతో ‘పెట్రోల్‌లోని కల్తీని కూడా కనిపెట్టవచ్చు’ అంటున్నారు గల్లా చంద్రశేఖర్‌ అనే మొక్కల పరిశోధకుడు. ఆయన పరిశోధనల విశేషాలివి... 


ఒక ఉదయం పొలం గట్ల మీద నడుస్తున్న చంద్రశేఖర్‌ పాదాలకు గాలికి ఊగుతున్న గడ్డిపోచలు తగిలాయి. చిత్తూరు జిల్లా, కారాకొల్లు గ్రామానికి చెందిన ఆయనకు ప్రకృతి, మొక్కలంటే చాలా ఇష్టం. కనిపించిన ప్రతీ మొక్కను, ఆకును పరిశీలించి దాని పూర్వాపరాలు తెలుసుకోవడం సరదా. ఆ ఆసక్తితోనే పాదాలను తగిలిన గడ్డిపోచలను తెంచి, పక్కనే ఉన్న పంటకాలువ గట్టున కూర్చుని పరిశీలించసాగాడు. చీపురు పుల్లలా ఉన్న ఆ గడ్డిపరకను నీటిలో వేయగానే, అది ఒక జీవిలా కదలడం గమనించాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ గడ్డిపరకను వేడిగా ఉన్న చోట పెట్రోల్‌లో ముంచి తీశాడు. అంతే... అది గడియారం ముల్లులా తిరిగింది. తన పరిశీలనను నిర్ధారించుకోవడానికి ఆయన ఆ గడ్డిపరకలను తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలోని వైరాలజీ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాడు. అక్కడ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.వి.ఆర్‌.సాయిగోపాల్‌ వాటిని మైక్రోస్కోప్‌లో పరిశీలించి, తడి తగిలినప్పుడు ఆ గడ్డిపోచ గిరా గిరా తిరగడం చూసి ఆశ్చర్యపోయాడు.


‘‘అది పందిముల్లు మొక్క. అరుదైన గడ్డిజాతికి చెందినది. శాస్త్రీయంగా దానిని ‘అరిస్టిడా పనిక్యూలటా’ అంటారు. నీరు, ఆమ్లం, ఆల్కహాలు తగిలినప్పుడు ఈ గడ్డిపోచ వివిధరకాలుగా స్పందించడం కనిపించింది. వేడి, నీరు తగిలినప్పుడు క్లాక్‌వైజ్‌, యాంటీ క్లాక్‌వైజ్‌ తిరుగుతోంది. శక్తివంతమైన మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తే ఈ అరుదైన గడ్డిపోచ చుట్టూ చిన్నముళ్లు, జీవకణాలు కనిపించాయి. నీరు తగిలినప్పుడు అవి వ్యాకోచించి నెమలిపింఛంలా విచ్చుకుంటున్నాయి’’ అన్నారు సాయిగోపాల్‌.


నిరంతర పరిశోధనలు...

డిగ్రీ చదివిన చంద్రశేఖర్‌కు పరిశోధనలంటే మక్కువ. బాల్య మిత్రులతో కలిసి ఊరిలో రైతులకు మేలు చేసే అంశాల మీద నిరంతరం ఆయన పరిశోధనలు చేస్తుంటారు. కారాకొల్లు గ్రామంలో ఒకప్పుడు దోమల సమస్య విపరీతంగా ఉండేది. దాంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభించాయి. దోమల వల్ల పాడి రైతులు పశువుల పాకలోకి వెళ్లి పాలు పితకడానికి ఇబ్బందిపడేవారు. అలాంటి పరిస్థితుల్లో శేషాచలం పర్వత ప్రాంతాల్లో అరుదుగా కనిపించే చిక్కుడు లాంటి ఒక తీగజాతి మొక్కను గుర్తించింది చంద్రశేఖర్‌ మిత్రబృందం. రాత్రి పూట ఒక గదిలో ఆ కాయల జిగురును ఉంచారు.


ఆశ్చర్యంగా దోమలన్నీ ఆ జిగురుకు అంటుకుపోయాయి. ఆ మొక్క ఆకు రసాన్ని దోమలు, లార్వా ఉన్న మురుగునీటిపై చల్లారు. వారి పరిశోధనకు చక్కని ఫలితం కనిపించి, ఆ మొక్క కీటక నాశినిగా రుజువయ్యింది. ఆ మొక్కలను ఊరంతా పంచడంతో దోమల బాధ పోయింది. ఈ విషయం తెలిసిన ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు చంద్రశేఖర్‌ బృందాన్ని ప్రశంసించి, వారి పరిశోధనలను కొనసాగించాల్సిందిగా ప్రోత్సహించారు. అప్పటి నుంచి చంద్రశేఖర్‌ తన స్నేహితు లైన వెంకటేశ్వర్లు, శివ, శ్రీధర్‌, చిరంజీవులు, బత్తినాయుడు భాస్కర్‌, మురళిలతో కలిసి చిత్తూరు అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే ఆకులు, కాయలు వెదికి, వాటితో ప్రయోగాలు చేస్తూ గ్రామీణ శాస్త్రవేత్తలుగా మారారు.


కలుపు మందు కనిపెట్టారు...

ఊరిలో రైతుల వ్యవసాయ భూమి రసాయన ఎరువులతో దెబ్బతినకుండా, పొలాల్లో కలుపు నివారణకు తన మిత్రబృందంతో కలిసి పరిష్కార మార్గాన్ని సూచించారు చంద్రశేఖర్‌. పొలాల్లో నులిపురుగులు మొక్క వేరుభాగంలో ఉంటాయి. కంటికి కనిపించకుండా పంటసారాన్ని పీల్చేస్తాయి. దాంతో పంట ఎదుగుదల మందగిస్తుంది. ఈ ప్రమాదకర నులిపురుగును నిర్మూలించే ఆకురసాల కోసం అన్వేషణ కొనసాగించారాయన. కొన్ని ఆకు రసాలతో కలుపు నివారణ మందును కనిపెట్టారు. దీనివల్ల కలుపు నిర్మూలన జరగడమేగాక పంట ఏపుగా పెరుగుతుంది. అంతేకాదు ఇరవై శాతం అధిక దిగుబడి రావడం కూడా గుర్తించారు.


2017లో విశాఖలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌’లో వీరి పరిశోధన ప్రముఖంగా నిలిచింది. ఈ రకం పరిశోధనలన్నీ వీరు సొంత ఖర్చుతోనే చేస్తున్నారు. ‘‘నాకున్న ఎనిమిది ఎకరాల్లో ఇప్పటికే నాలుగు ఎకరాలు అమ్మేశాను. అయినా సరే పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండటంతో సంతృప్తిగా ఉంది’’ అన్నారు చంద్రశేఖర్‌. సైన్స్‌ ద్వారా సమాజానికి మేలు చేయాలనేది వీరి నినాదం. ‘సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామ’ని చెబుతున్న చంద్రశేఖర్‌ ఫోన్‌ నెంబర్‌: 98495 41674.


ఆ లక్షణాల వల్లే...

అత్తిపత్తి ఆకుల్ని తాకినప్పుడు దానిలోని మృదు కణజాలం నుంచి నీరు కాండంలోకి వెళుతుంది. దాంతో పటుత్వం తగ్గి ఆకులు ముడుచుకుపోతాయి. కొంత సమయానికి కాండం నుంచి నీరు బుడిపెలోకి చేరి ఆకులు యథాస్థితికి వస్తాయి. ఇలాంటి జాతికి చెందిన అరుదైన మొక్క పందిముల్లు. ఈ గడ్డిలో థర్మల్‌ పవర్‌ని మెకానికల్‌ పవర్‌గా మార్చే లక్షణాలుంటాయి. దీనివల్లే నీటిలో, పెట్రోల్‌లో తడిస్తే గిరగిరా తిరుగుతుందని, కిరోసిన్‌లో తడిస్తే తిరగదని చంద్రశేఖర్‌ పరిశోధనలో తేలింది. దీని వల్ల పెట్రోల్‌ కల్తీని కనిపెట్టొచ్చని అంటున్నారు. 


- మాలతి,  9492046621






Updated Date - 2020-11-23T02:11:42+05:30 IST