వీరు మారరు..!

ABN , First Publish Date - 2020-04-09T12:13:35+05:30 IST

ఇప్పటివరకూ జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడకపోవడం ఉపశమనం కలిగిస్తోంది.

వీరు మారరు..!

విశాఖ నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు

ఆందోళనలో కార్యాలయ సహచరులు

కట్టడిని కట్టుదిట్టం చేయాలని ప్రజల విజ్ఞప్తి 


విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ఇప్పటివరకూ జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడకపోవడం ఉపశమనం కలిగిస్తోంది. ముందస్తు అప్రమత్తత  వల్లనే ఇది సాధ్యమైందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇదొక కారణమే అయినా...లాక్‌డౌన్‌ గడువు సమీపిస్తున్న వేళ యంత్రాంగానికి సరికొత్త సవాల్‌ ఎదురవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వారిపై దృష్టి పెట్టాల్సి ఉంది. విశాఖను రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం యంత్రాంగంపై ఉంది.  ఉద్యోగ, ఉపాధి కోసం జిల్లాకు చెందిన వేలాది మంది విశాఖలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి వచ్చిన వారిని ఎక్కడికక్కడే పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారు. నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కానీ కొందరు అధికారులు, ప్రైవేట్‌ ఉద్యోగులు విశాఖ నుంచే ఇప్పటికీ రాకపోకలు సాగిస్తున్నారు. వారి విషయంలో ఉదాసీనత విమర్శలకు తావిస్తోంది. లాక్‌డౌన్‌ తొలిరోజుల్లో పోలీస్‌ శాఖకు చెందిన అధికారులు కూడా విశాఖ నుంచి రాకపోకలు సాగించేవారు. ఎస్పీ రాజకుమారి  అదేశాలతో వారు    విజయనగరంలో ఉంటూ విధులకు హాజరవుతున్నారు.. కానీ కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు మాత్రం ఇప్పటికీ రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. దీంతో వారితో పనిచేసే సహచర ఉద్యోగులు, అధికారులు భయపడుతున్నారు. తుమ్మినా, దగ్గినా హడలెత్తిపోతున్నారు. సామాన్య ప్రజల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరినే...ఉద్యోగులు, అధికారుల విషయంలో పాటించాలని ప్రజలు కోరుతున్నారు. 

పటిష్టంగా లాక్‌డౌన్‌

జిల్లా అంతటా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులు 4, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు 8, జిల్లాలోని వివిధ కూడళ్లలో మరో 21 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. సరిహద్దు రహదారులను మూసివేశారు. అటు కొత్తవలస సరిహద్దుతో పాటు నాతవలస వద్ద విశాఖ నుంచి వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. విజయనగరంలోకి ప్రవేశించే ‘వై’ జంక్షన్‌ వద్ద భారీ బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకుంటున్నారు. కానీ విశాఖ నుంచి రాకపోకలు సాగించే అధికారులు, ఉద్యోగులు తమ పరిచయాలను ఉపయోగించుకొని నగరానికి చేరుకుంటున్నారు. దీంతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కలెక్టర్‌ చొరవ తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

నిబంధనలు పాటించాల్సిందే

విశాఖ, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోనే ఉండి విధులు నిర్వాహించాలి. దీనిపై ప్రభుత్వ ఆదేశాలున్నాయి. కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెడతాం. ప్రభుత్వం అదేశాలు, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. లాక్‌డౌన్‌ కొనసాగే వరకూ నిబంధనలు పాటించాల్సిందే.

-బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం


 


Updated Date - 2020-04-09T12:13:35+05:30 IST