పెట్రోల్‌ బంకులో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-27T06:40:47+05:30 IST

కల్తీ డీజిల్‌ విక్రయించారని ఫిర్యాదు రావడంతో జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులోని కేకే ఫిల్లింగ్‌ స్టేషన్‌ను అధికారులు బుధవారం తనిఖీ చేసి శాంపిల్స్‌ సేకరించారు.

పెట్రోల్‌ బంకులో అధికారుల తనిఖీలు
కుడకుడ పెట్రోల్‌ బంక్‌లో గుమిగూడిన వాహనదారులు

కల్తీ డీజిల్‌ విక్రయిస్తున్నారని వాహనదారుడి ఫిర్యాదు

సూర్యాపేటటౌన్‌, జనవరి 26: కల్తీ డీజిల్‌ విక్రయించారని ఫిర్యాదు రావడంతో  జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులోని కేకే ఫిల్లింగ్‌ స్టేషన్‌ను అధికారులు బుధవారం తనిఖీ చేసి శాంపిల్స్‌ సేకరించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట పట్టణానికి చెందిన కాసాని పాపయ్య తన కారులో ఈ నెల 16వ తేదీన  కేకే ఫిల్లింగ్‌ స్టేషన్‌లో  రూ.500 డీజిల్‌ పోయించారు. కారు బంక్‌ నుంచి అర కిలోమీటరు  దూరం వెళ్లగానే ఆగిపోయిది. కారును షెడ్డుకు తీసుకువెళ్లగా డీజిల్‌లో నీళ్లు కలిశాయని మెకానిక్‌ చెప్పాడు. పాపయ్య వెంటనే ఈ విషయాన్ని బంక్‌ యజమానికి దృష్టికి తీసుకువెళ్లగా, ఆరోజు వర్షం కురిసిందని, దీంతో వర్షపు నీరు డీజిల్‌ కలిసి ఉంచవచ్చని చెప్పి  కారు మరమ్మతు ఖర్చులో కొంత చెల్లించాడు.  తీరా చూస్తే కారు ఇంజన్‌ సీజ్‌ అయిందని, మరమ్మతుకు రూ.80వేలు అవుతుందని  పాపయ్యకు మెకానిక్‌  తెలిపాడు.  దీంతో పాపయ్య బంక్‌ యజమానికి సంప్రదించగా తనకు ఏ సంబంధం లేదన్నాడు.  దీంతో అదే రోజు 16వ తేదీన విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా బంక్‌ను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీ నిర్వహించిన సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ బాధితుడి ఫిర్యాధు మేరకు బంక్‌ను తనిఖీ చేయడంతో పాటు శ్యాంపిల్స్‌ సేకరించామన్నారు. ఈ శ్యాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపుతామని,  ఫలితాలు వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు తెలుపుతామన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు బంకు ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో ఆందోళనను వారు విరమించారు. 



Updated Date - 2022-01-27T06:40:47+05:30 IST