Abn logo
Sep 29 2020 @ 00:21AM

పట్టాల పంపిణీకి కసరత్తు

Kaakateeya

సింగరేణి స్థలాల లబ్ధిదారులకు డిమాండ్‌ నోటీసుల అందజేత

దరఖాస్తుదారుల ఇళ్లను సర్వే చేసిన అధికారులు

  

 శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 28: శ్రీరాంపూర్‌ ఏరియాలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 30 - 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి జీవో 58, 59 ప్రకారం ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో వివిధ కాలనీలలో ఆరు వేలకు పైగా కార్మిక, కార్మికేతరులు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇంటి పన్ను, ఆస్తి పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు, ఇతరాత్ర పన్నులు చెల్లిస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని యేళ్లుగా అధికారులు, నాయకులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఏడాదిన్నరక్రితం ఇళ్ల స్థలాల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రెవెన్యూ శాఖ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లను సర్వే చేసి నివేదిక రూపొందించారు. పట్టాల కోసం డీడీల రూపంలో కొంత మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించారు. అయినప్పటికీ పట్టాల ప్రక్రియ నిలిచిపోయింది. శ్రీరాంపూర్‌ ఏరియాలో 2,840 మంది కార్మికులు, కార్మికేతరులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుని డీడీలు చెల్లించారు. అయినప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడంతో పలుమార్లు ప్రజా ప్రతినిధులు సైతం నిలదీశారు.


దీంతో దరఖాస్తు దారుల సర్వే వివరాలను మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో పూర్తి స్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత తహసీల్దార్‌కు పట్టాల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం 58, 59 జీవో ప్రకారం ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలు బట్టి గజానికి కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్‌ నోటీసులను నస్పూర్‌ తహసీల్దార్‌ లబ్ధిదారులకు జారీ చేసి స్వయంగా అందించారు. ముందుగా 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి డిమాండ్‌ నోటీసులు అందజేశారు. అక్టోబర్‌ 11 లోగా ఒక్క వాయిదా, నవంబర్‌ 11 లోగా రెండో వాయిదా స్థలాల క్రమబద్ధీకరణకు రుసుం చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. మిగతా 2,140 మంది లబ్ధిదారులకు డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేస్తున్నామని, రెండు నెలల లోగా డీడీలు చెల్లించిన వారికి పట్టాలు అందజేస్తామని నస్పూర్‌ తహసీల్దార్‌ శేఖర్‌ ప్రకటించారు. పట్టాల కోసం దరఖాస్తు చేయని వారు ప్రస్తుతం డీడీలు చెల్లించే అవకాశం లేదని పేర్కొన్నారు.


దరఖాస్తు చేసుకున్న 2,840 మంది కార్మిక, కార్మికేతరులకు రెండు నెలల లోగా పట్టాలు ఇచ్చిన తరువాత మిగతా వారి దరఖాస్తులు పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం దాని కోసం ఏర్పాట్లు చేసిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చెప్పారు. ఆ ప్రకియ ప్రభుత్వ ఉత్తర్వూల మేరకు తదుపరి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీరాంపూర్‌ లోని అరుణక్క నగర్‌, ఆర్కే 6 గాంధీనగర్‌, హిమ్మత్‌నగర్‌, వాటర్‌ ట్యాంక్‌ ఏరియా, సంగమల్లయ్యపల్లి వాసులు 700 మందిని గుర్తించి డిమాండ్‌ నోటీసులను అందజేశారు. వీరికి రెండు నెలల్లో పట్టాలు ఇవ్వనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న తమ కళ నేరవేరనుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల కోసం ఇచ్చిన మాట ప్రకారం తమ కళ నెరవేరుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావుకు లబ్ది దారులు కృతజ్ఞతలు తెలిపారు. 


ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నాం.. శేఖర్‌, నస్పూర్‌ తహసీల్దార్‌

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నాం  నవంబర్‌ చివరికల్లా 2,840 మందికి ఇళ్ల స్థలాల పట్టాల ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రస్తుతం 700 మందికి డిమాండ్‌ నోటీసులు జారీ చేశాం. డీడీల ద్వారా ప్రత్యేక రుసుం చెల్లించిన వారికి త్వరితగతిన పట్టాలు మంజూరు చేస్తాం. 

Advertisement
Advertisement
Advertisement