Abn logo
Apr 8 2020 @ 05:18AM

ఇంకా 120 మంది తేలని ఢిల్లీ కాంటాక్ట్‌ లెక్క

గుర్తించలేకపోతున్న అధికారులు

30 మంది వైద్యులకు కూడా పరీక్షలు

అదనంగా మరో 50 కేసులు 

రిపోర్టుల కోసం ఎదురుచూపు


కర్నూలు, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీరందరికీ చికిత్స చేస్తే కరోనా సమస్య పరిష్కారమైనట్లనుకుటే పొరపాటే. కరోనా కేసులకు ఇది ఒక ముఖం మాత్రమే. ఈ లింక్‌ ఇంకా పూర్తి కాలేదు. ఈ అధికారిక లెక్కలకు అవతల మరో సత్యం కూడా ఉన్నది. సుమారుగా మరో 120కి పైగా కరోనా కేసులు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఢిల్లీ కాంటాక్ట్‌లోనివే. వీరిని గుర్తించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. వీరి కోసం జిల్లా అంతా జల్లెడ పడుతున్నారు. నంద్యాలలో దొరకని 40 కేసులతో పాటు కర్నూలు, బనగానపల్లె, ఆదోని తదితర ప్రాంతాల్లో ఇంకా పదుల సంఖ్యలో ఢిల్లీ కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయి. ఇవన్నీ మిస్సింగ్‌ కింద నమోదయ్యాయి. వీరిని ఆరా తీయడానికి మత పెద్దలు కొందరు సహకరించలేదనే అభిప్రాయం ఉంది. ఇక ప్రజలే తమ పరిసరాల్లో కరోనా సోకిన అనుమానితులను గుర్తిస్తే అధికారులకు సహకరించాల్సిందే. 


ఢిల్లీలో జరిగిన ఓ మత సమావేశానికి వెళ్లిన జిల్లా వాసులు మార్చి 19, 20 తేదీల్లో రైళ్లలో, విమానాల్లో తిరిగి వచ్చేశారు. అలాంటివారిని 357 మందిని గుర్తించామని, 338 మందికి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఇటీవల  తెలిపారు. ఇక అలాంటి కేసులు జిల్లాలో లేవని స్పష్టం చేయలేదు. నంద్యాల నుంచి 120 మంది వెళ్లి వచ్చారనే సమాచారం ఉంది. వారిలో 70 మంది మాత్రమే అందుబాటులోకి వచ్చారు. మిగిలిన 40 మంది గురించి అధికారులకు తెలియదు. కర్నూలు పట్టణంలో 175 మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని గుర్తించారు. వీరిలో 58 మంది ఇంకా లెక్క తేలలేదు. ఎమ్మిగనూరులో 20 మంది అందుబాటులోకి రాలేదు. ఆదోనిలో ఐదారుగురి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో ఎక్కడిక్కడ స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. 


 దారి మధ్యలో అడ్డంకులు

ఇలా లెక్క తేలని వారిలో కొందరు ఢిల్లీ తిరుగు ప్రయాణంలో చిక్కుకపోయారనే సమాచారం ఉంది. నంద్యాలకు చెందిన 8 మంది మహారాష్ట్రలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. వారికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఇలా అనేక కారణాల వల్ల ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి లెక్కలు తేలడం లేదు. అలాగే ఆదోనికి చెందిన 13 మంది వలస కార్మికులు రెండ్రోజుల క్రితమే జిల్లాకు తిరిగి వచ్చారు. వీరిని కుటుంబసభ్యులే ఇండ్లలోకి రానివ్వలేదు. వీరి వివరాలు స్థానికులు అధికారులకు తెలియజేశారు. అధికారులు వారిని కర్నూలు క్వారంటైన్‌కు తొలుత తరలించారు.


అక్కడ కొన్ని సమస్యలు ఉన్నందు వల్ల తిరిగి ఆదోని క్వారంటైన్‌కు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో వైరస్‌ సోకిన వారందరి లిస్టు ఇంకా పూర్తి కాలేదు. మొదట ఢిల్లీ కాంటాక్ట్‌ లిస్టింగ్‌ వ్యక్తులు 120 మందిని గుర్తించి క్వారంటైన్లకు తరలించకుంటే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యం కాదు. ఇప్పుడున్న 74 పాజిటివ్‌ కేసులు ఎంతకైనా పెరిగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. 


Advertisement
Advertisement