ఆదేశాలు వచ్చేవరకు సంయమనం పాటించడం

ABN , First Publish Date - 2020-12-04T06:11:11+05:30 IST

మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో నెలకొన్న సరిహద్దు సమస్యను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతున్నామని, దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరు ప్రాంతాల గిరిజనులు గొడవలకు దిగకుండా సంయమనం పాటించాలని ఆంధ్రా, ఒడిశా అధికారులు స్పష్టం చేశారు

ఆదేశాలు వచ్చేవరకు  సంయమనం పాటించడం
సరిహద్దు సమస్యపై చర్చిస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు


దాడులు, భూముల స్వాధీనానికి పాల్పడవద్దు

ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనులకు అధికారుల హెచ్చరిక

డెక్కపారు వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం


డుంబ్రిగుడ, డిసెంబరు 3: మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో నెలకొన్న సరిహద్దు సమస్యను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతున్నామని, దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరు ప్రాంతాల గిరిజనులు గొడవలకు దిగకుండా సంయమనం పాటించాలని ఆంధ్రా, ఒడిశా అధికారులు స్పష్టం చేశారు. కొల్లాపుట్టు పంచాయతీలో ఒడిశాకు ఆనుకుని వున్న గ్రామాల్లో నెలకున్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం డెక్కపారు గ్రామం వద్ద సమావేశమయ్యారు. ఆంధ్రా తరపున పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, డుంబ్రిగుడ తహసీల్దార్‌ జయప్రకాశ్‌తోపాటు అటవీ శాఖ అధికారులు రెవెన్యూ సిబ్బంది; ఒడిశా నుంచి కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మధుసూదన్‌ మిశ్రా, సబ్‌కలెక్టర్‌ అర్చనాదాస్‌, కోరాపుట్‌ ఎస్పీ, అటవీ శాఖ అధికారులతోపాటు సరిహద్దు గ్రామాల గిరిజనులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల సరిహద్దు మ్యాస్‌లను పరిశీలించారు. ఇరురాష్ట్రాల సరిహద్దులో వున్న గ్రామాల గిరిజనులు పరస్పర దాడులు, భూముల స్వాధీనం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. మ్యాప్‌ల ప్రకారం సర్వే చేయించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదిస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సరిహద్దు గ్రామాల గిరిజనులు సంయనం పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇరురాష్ట్రాల అధికారుల సమావేశం ముగిసిన తరువాత స్ధానిక తహసీల్దార్‌ జయప్రకాశ్‌ విలేకర్లతో మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ పరంగా శుక్రవారం నుంచే భూసర్వే చేపడుతున్నామని తెలిపారు. ఇదిలావుండగా ఇరురాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలోనే ఆంధ్రా భూపరిక్షణ కమిటీ ఆధ్వర్యలో స్థానిక ఆందోళనకు దిగి, సరిహద్దు సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.


Updated Date - 2020-12-04T06:11:11+05:30 IST