అద్దె భవనాల్లో కార్యాలయాలు

ABN , First Publish Date - 2021-06-15T05:25:40+05:30 IST

మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

అద్దె భవనాల్లో కార్యాలయాలు
అద్దె భవనంలో నిర్వహిస్తున్న హౌసింగ్‌ కార్యాలయం

  1. బోర్డులేని హౌసింగ్‌ కార్యాలయం
  2. పిల్లర్లతో ఆగిన తహసీల్దార్‌ కార్యాలయ భవనం 
  3. పట్టించుకోని అధికారులు 


చాగలమర్రి, జూన్‌ 14: మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తప్ప సిబ్బందికి, ప్రజలకు సౌకర్యంగా లేదు. హౌసింగ్‌, వెలుగు కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. హౌసింగ్‌ కార్యాలయానికి కనీసం   బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది  పడుతున్నారు. ఈ కార్యాలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి. అక్కడ విధులు నిర్వహిస్తున్న హౌసింగ్‌ ఏఈ ఇన్‌చార్జి కావడంతో ఎప్పుడు వస్తారో వెళ్తారో తెలియదు. వెలుగు కార్యాలయం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ భవనానికి కూడా సరైన వసతులు లేక పొదుపు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం భవనం ఏర్పాటుకు 4 ఏళ్ల క్రితం రూ.90 లక్షలతో భవన పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు పనులు చేసి వదిలేశారు. ఇంతవరకు భవన పనులు ముందుకు సాగక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయానికి వసతులతో కూడిన ప్రభుత్వ భవనం లేక పోవడంతో ప్రజలు, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి నిధులు మంజూరైన పనులు పూర్తిచేయక అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా భవన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. రూ.25 లక్షలు కేటాయించినా ఇంతవరకు స్త్రీశక్తి భవన పనులు చేపట్టలేదు. ఉన్నతాధికారులు స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలకు  సొంత భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. 




Updated Date - 2021-06-15T05:25:40+05:30 IST