ప్రతి ఆక్సిజన్‌ ప్లాంటుకో అధికారి

ABN , First Publish Date - 2021-05-15T09:56:49+05:30 IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్న ప్రతి ప్లాంటుకు విద్యుత్‌ సరఫరా పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి ..

ప్రతి ఆక్సిజన్‌ ప్లాంటుకో అధికారి

నిరంతర విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు

విద్యుత్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణకు చర్యలు

ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ వెల్లడి


అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్న ప్రతి ప్లాంటుకు విద్యుత్‌ సరఫరా పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా ఇటువంటి చర్యలు తీసుకొందని, అదే తరహాలో తాము కూడా ఈ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరా ఆగకుండా చూడటానికి ఈ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. దీనిపై శుక్రవారం ఆయన రాష్ట్రంలోని మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లు మొత్తం 22 ఉన్నట్లు గుర్తించారు. విశాఖ స్టీల్‌ సహా మూడు భారీ స్థాయి ఉత్పత్తి ప్లాంట్లు తూర్పు ప్రాంత డిస్కం పరిధిలో ఉన్నాయి. ఇవి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఈ మూడు ప్లాంట్లు సరాసరిన రెండున్నర లక్షల కిలోవాట్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. సెంట్రల్‌ డిస్కం పరిధిలో చిన్న సైజు ప్లాంట్లు పదిహేను, దక్షిణ ప్రాంత డిస్కం పరిధిలో నాలుగు చిన్న ప్లాంట్లు ఉన్నాయి. ఈ చిన్న ప్లాంట్లు సుమారుగా నాలుగు వేల కిలోవాట్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ‘‘ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫరా అత్యవసరంగా మారినందువల్ల ఈ ప్లాంట్లకు నిరంతరాయ విద్యుత్‌ సరఫరాను ప్రఽథమ ప్రాధాన్యంగా పెట్టుకోండి. చిన్న అవాంతరం కూడా రానివ్వవద్దు. ముందు జాగ్రత్తగా వీటికి ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు కూడా చేసుకోండి.ఎప్పుడైనా సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయ లైన్ల నుంచి సరఫరా ఇవ్వవచ్చు’’ అని మూడు డిస్కంల అధికారులకు శ్రీకాంత్‌ సూచించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి కలిగిన అధికారులను ఈ ప్లాంట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆయన చెప్పారు. దీనితోపాటు ఆస్పత్రులకు విద్యుత్‌ సరఫరాను కూడా ప్రాధాన్య అంశంగా ఎంచుకొని పర్యవేక్షించాలని, నిర్వహణ పనులు పూర్తి చేసి వాటికి కూడా ఎక్కడా సరఫరాలో ఆటంకం రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో నాలుగు వేల వెంటిలేటర్లు ఉన్నాయని, ఇవి ఉన్న ఆస్పత్రులకూ, ప్రధానమంత్రి జన యోజన పఽథకం కింద నమోదైన ఐదు వందల ఆస్పత్రులకూ విద్యుత్‌ సరఫరాను ప్రఽథమ ప్రాధాన్యంగా యెంచి అందించాలని ఆయన చెప్పారు. 



1500 విద్యుత్‌ సిబ్బందికి కరోనా

కరోనా రెండో దశ విద్యుత్‌ సిబ్బందిపై చూపిన ప్రభావంపై విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారుల సమావేశం సమీక్ష జరిపింది. మొత్తం పదిహేను వందల మంది విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని సమావేశం గుర్తించింది. ‘‘కరోనా రెండోదశ విద్యుత్‌ సంస్థలపై తీవ్రప్రభావం చూపింది. సంస్థల ఆదాయం పడిపోవడంతోపాటు గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో అధికారులు, సిబ్బంది దీనికి గురయ్యారు. అందరూ కరోనా భయంతో ఇళ్లకే పరిమితం అవుతున్న సమయంలో విద్యుత్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎక్కడా అవాంతరాలు రాకుండా ఇరవై నాలుగు గంటలూ నిరంతరాయ సరఫరా జరిగేలా పనిచేస్తున్నారు. ఎంతో మంది కరోనాకు గురవుతున్నా ఆ బాధను దిగమింగి ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పనిచేస్తున్నారు. వారి అంకిత భావానికి హ్యాట్సాఫ్‌’’ అని శ్రీకాంత్‌ ప్రశంసించారు. సిబ్బంది ఆరోగ్య రక్షణకు అనేక చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, ఆస్పత్రుల్లో విద్యుత్‌ సిబ్బందికి నగదు రహిత చికిత్స అందేలా చూస్తున్నామని, వారికి క్రెడిట్‌ కార్డు సౌకర్యం కల్పించామని, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ లభ్యమయ్యేలా చూస్తున్నామని ఆయన తెలిపారు. సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దశలవారీగా వ్యాక్సినేషన్‌ చేయించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - 2021-05-15T09:56:49+05:30 IST