అధికారభాష, అర్ధసత్యాలు

ABN , First Publish Date - 2021-09-16T06:23:29+05:30 IST

హిందీ వాదం విశ్రమించదు. అవకాశం దొరికినప్పుడల్లా అది తలెత్తుతూనే ఉంటుంది. మంగళవారం నాడు ‘హిందీదివస్’ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని మంచిమాటలు చెప్పారు. దేశభాషలన్నిటికీ హిందీ నేస్తమని...

అధికారభాష, అర్ధసత్యాలు

హిందీ వాదం విశ్రమించదు. అవకాశం దొరికినప్పుడల్లా అది తలెత్తుతూనే ఉంటుంది. మంగళవారం నాడు ‘హిందీదివస్’ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని మంచిమాటలు చెప్పారు. దేశభాషలన్నిటికీ హిందీ నేస్తమని, పరస్పరతతో సహజీవనం నెరపాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘స్వావలంబన’ దృక్పథంలో భాష ముఖ్యమయిన అంతర్భాగమని, భాషల విషయంలో కూడా స్వాతంత్ర్యం సాధించినప్పుడే ఆత్మనిర్భరత సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడే దేవనాగరి లిపిలో హిందీని అధికారభాషగా స్వీకరించామని ఆయన గుర్తు చేస్తున్నారు. 1949 సెప్టెంబర్ 14 నాడు దేవనాగరి -హిందీని దేశ అధికార భాషగా నిర్ధారించిన మాట వాస్తవమే. ఆ నిర్ణయం 1950లో ఆమోదించిన రాజ్యాంగంలో 343(1)ఆర్టికల్‌గా స్థానం పొందింది. భాష, అక్షర లిపిలతో పాటు, అంకెలు అంతర్జాతీయ, భారతీయ రూపంలో ఉండాలని కూడా ఆ ఆర్టికల్ చెబుతోంది. భారత పార్లమెంటులో వ్యవహారాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే నడవాలని, పార్లమెంటరీ కార్యక్రమాలలో, కేంద్ర-రాష్ట్రాల నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇంగ్లీషును అనుమతించవచ్చునని పై అధికరణం చెబుతోంది. అయితే, ఇక్కడితో కథ పూర్తికాలేదు. ఇంగ్లీషు వినియోగం పదిహేను సంవత్సరాల వరకు, అంటే 1965 జనవరి 26 వరకు మాత్రమే సాగాలని, ఆ తరువాత హిందీయే ఏకైక అధికార భాష అవుతుందని కూడా రాజ్యాంగం చెప్పింది. కానీ, 1963లోనే అధికార భాషల చట్టం రూపొంది, ఆంగ్లభాష వినియోగాన్ని, హిందీతో పాటు నిరవధికం చేసింది. అందుకు తమిళనాడు వంటి అనేక ప్రాంతీయ భాషారాష్ట్రాలు చేసిన ఉద్యమాలు, చెప్పిన అభ్యంతరాలు కారణం. ఇక అనేక దేశభాషలు కూడా అధికార భాషల జాబితాలో చేరాయి. 22 భాషలు ఇప్పుడు రాజ్యాంగంలోని 8వ షెడ్యూలు సాక్షిగా అధికార భాషలు. ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో ఇష్టం వచ్చిన భాషను అధికార భాషగా ఎంచుకోవచ్చును. 


మరి అమిత్ షా, 343 అధికరణం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప, అధికార భాషల చట్టం గురించి చెప్పడం లేదు. ఎనిమిదో షెడ్యూలును ప్రస్తావించడం లేదు. హిందీని ఏకైక అధికార భాషగా చేయాలంటే, అధికారభాషల చట్టాన్ని రద్దుచేయాలి. ఎన్‌డిఎ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అధికారిక, బహిరంగ సభల్లోను, అంతర్జాతీయ వేదికలపై కూడా హిందీనే ఉపయోగించేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా 2014 నుంచి అధికార వ్యవహారాలలో హిందీ వినియోగాన్ని ప్రత్యేకమైన దృష్టితో పెంచుతూ వచ్చారు. కానీ, హిందీయేతర భాషల రాష్ట్రాలలో ప్రజల వైఖరులు ఏ మాత్రం మారలేదని గుర్తించాలి. అనుసంధాన భాషగా హిందీని ఉపయోగించడానికి దక్షిణాది రాష్ట్రాలు ఏ మాత్రం సుముఖంగా లేవు. 


మాతృభాషలో విద్యాబోధనకు, అధికారిక భాషకు అమిత్ షా ముడిపెడుతున్నారు. అమిత్ షాకు కానీ, నరేంద్రమోదీకి కానీ హిందీ మాతృభాష కాదు. కానీ, హిందీని అధికారభాషగా అమలుపరచడం, వారు సాధించదలచుకున్న ఐక్యభావానికి కానీ, జాతీయతకు కానీ అవసరమని భావించి, ఆ భాషలో వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలు కానీ, బెంగాల్ కానీ, కేరళ తమిళనాడు కర్ణాటకలు కానీ తమ తమ భాషలకు ప్రోత్సాహం, ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నాయి. అదే సమయంలో మరే భారతీయ భాష అయినా దేశంలో అనుసంధాన భాష కావడం ఇతర భాషలకు చేటు చేస్తుందని నమ్ముతాయి. ఉన్నత విద్యాబోధన ప్రాంతీయ భాషల్లో జరగాలని, అందుకు కావలసిన పాఠ్యసామగ్రి అందుబాటులోకి తేవాలని నూతన విద్యావిధానం చెబుతున్నది. నిజానికి, ఉన్నత విద్యాబోధనకు కావలసిన హంగు, సామర్థ్యం హిందీకి అలవరచుకున్నారు తప్ప వివిధ ప్రాంతీయ భాషలకు అందుకు కావలసిన సహకారం అందించలేదు. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులను తెలుగులో రూపొందించాలంటే ఎట్లా సాధ్యం? 


గాంధీ, పటేల్‌లు హిందీ అధికార భాషకు అనుకూలురని కూడా గతంలో అమిత్ షా అన్నారు. అది కూడా అర్ధసత్యమే. గాంధీజీ ఇంగ్లీషునకు వ్యతిరేకి అన్నది వాస్తవం. కాకపోతే, ఆయన, ఉత్తరాదిలోని అన్ని మతవర్గాల ప్రజల వాడుకకు దగ్గరగా ఉండే హిందూస్థానీని అనుసంధాన భాషగా ఇష్టపడ్డారు. హిందీని అధికారభాష చేయడానికి అంబేడ్కర్ సూత్రప్రాయంగా అనుకూలురే కానీ, ఇంగ్లీషు సామర్థ్యం సార్వజనీనం అయ్యేవరకు హిందీని కొనసాగించవచ్చునన్నది ఆయన దృష్టి. హిందీని దేశవ్యాప్తం చేయడం అన్నది అమిత్ షా వ్యూహం కావచ్చును కానీ, అందుకు జాతీయ నాయకుల పేర్లను ఉపయోగించనక్కరలేదు. హిందీకి అనుకూలంగా భావప్రచారం చేయవచ్చును, ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చును. ప్రజలు అంగీకరించేదాకా, హిందీ ఒకానొక అనుసంధాన భాష మాత్రమే. ఆ ప్రతిపత్తి కూడా తక్కిన భాషా ప్రాంతాల ప్రజలకు వివిధ రంగాలలో అన్యాయానికి కారణమవుతున్నది. ఇక్కడ ఇంగ్లీషును విదేశీ, పరాయి భాషగా చూడకూడదు. ఆ భాష మాతృభాషగా కలిగిన వారు తగిన సంఖ్యలో లేకపోవడమే, ఈ బహుభాషాదేశంలో అనుసంధాన, అధికార భాషా ప్రతిపత్తికి దానికి ఉన్న యోగ్యత. 

Updated Date - 2021-09-16T06:23:29+05:30 IST