శ్రీకాళహస్తిలో వెయ్యి పడకలతో జర్మన్‌ షెడ్‌

ABN , First Publish Date - 2021-05-17T05:41:57+05:30 IST

శ్రీకాళహస్తి పైప్స్‌ కర్మాగార సమీపంలో జర్మన్‌ షెడ్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

శ్రీకాళహస్తిలో వెయ్యి పడకలతో జర్మన్‌ షెడ్‌
శ్రీకాళహస్తిలో జర్మన్‌ షెడ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్న ఆర్డీవో

శ్రీకాళహస్తి, మే 16: శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల సరిహద్దులోని శ్రీకాళహస్తి పైప్స్‌ కర్మాగారం సమీపంలో జర్మన్‌ షెడ్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం వెయ్యి పడకలతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు.. ఆదివారం తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి ఆదివారం మండలంలోని రాచగున్నేరి పంచాయతీ సర్వే నెం.261లో ఉన్న 14 ఎకరాలను పరిశీలించారు. శ్రీకాళహస్తి పైప్స్‌ కర్మాగార ఆవరణలో నిమిషానికి 16 వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే భారీ ప్లాంట్‌ ఉండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చేయవచ్చు. పరిశ్రమ అవసరాల కోసం ల్యాంకో సంస్థ నిర్మించిన ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను ఫ్రాక్స్‌ఎయిర్‌ సంస్థ చూస్తోంది. 


ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉండటంతోనే.. 

 శ్రీకాళహస్తి పైప్స్‌ ఆవరణలో భారీ ఆక్సిజన్‌ ప్లాంటు ఉండటంతో కొవిడ్‌ బాధితుల సేవకు ఇబ్బంది ఉండదని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జర్మన్‌ షెడ్డులో ఏర్పాటు చేసే పడకలన్నీ ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్నవే. దీంతో ఇక్కడ ట్రయేజ్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ అవసరాల కోసం ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌ కొవిడ్‌ బాధితులకు వినియోగించవచ్చా.. లేదా.. అన్న అనుమానాలు రేకెత్తాయి. వీటి నివృత్తికిగాను ఇటీవల నేవీ, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్ల బృందం ఈ ప్లాంటును పరిశీలించి గ్రీన్‌సిగ్నలిచ్చారు. వీరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న కలెక్టరు హరినారాయణన్‌ ప్లాంట్‌ వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు, ఆ మేరకు మరణాలు పెరగడంతో జర్మన్‌ షెడ్ల నిర్మాణం మంచిదని ప్రభుత్వం భావించింది. ఆక్సిజన్‌ ప్లాంట్‌ అందుబాటులో ఉన్న శ్రీకాళహస్తి పైప్స్‌ ఫ్యాక్టరీ సమీపంలో వెయ్యి పడకల సామర్థ్యమున్న జర్మన్‌ షెడ్‌ నిర్మాణానికి అనుమతించింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీ నుంచి షెడ్డుకు ఆక్సిజన్‌ సరఫరా కోసం దాదాపు అర కిలో మీటరు మేర ప్రత్యేక పైప్‌లైను ఏర్పాటు చేయనున్నారు. కొవిడ్‌ బాఽధితులకు సేవలందించే వైద్యులకు తాత్కాలిక నివాసాలు, మందుల నిల్వ తదితర వాటికి ప్రత్యేక గదులు నిర్మించనున్నారు. ఆ మేరకు.. ఆదివారం ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌, సర్వేయర్‌ హరినాథ్‌ తదితరులు ఈ స్థలాన్ని పరిశీలించారు. తొలుత పదెకరాల విస్తీర్ణంలోనే షెడ్డు నిర్మించాలని భావించినా, పక్కనే 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మేత పొరంబోకు భూమిని అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-17T05:41:57+05:30 IST