Abn logo
Nov 28 2020 @ 01:42AM

ఆఫీసర్స్‌.. వాంటెడ్‌..!

అధిక శాతం పోస్టులు ఖాళీ

అన్ని విభాగాల్లోనూ ఇదే తీరు

ఒకరికే రెండు మూడు బాధ్యతలు

కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకాలు

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పనులు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలోని పలు విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లేక పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ కారకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకువస్తున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టి నెట్టుకొస్తున్నారు. వీరు తరచూ మారుతుండటంతో ముఖ్యమైన పనులు ముందుకు సాగడం లేదు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని చోట్ల ఒకరికే రెండు, మూడు బాధ్యతలు అప్పగించడంతో పనులు ముందుకు సాగడం లేదు. 

సర్దుబాటే..

జీహెచ్‌ఎంసీని ఆరుజోన్లు, 30 సర్కిళ్లుగా విభజించారు. అదనంగా సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఈ మేరకు సిబ్బంది, ఉద్యోగుల నియామకాలు జరగలేదు. ఉన్న అధికారులు, ఉద్యోగులనే సర్దుబాటు చేశారు. కొందరికి రెండు, మూడు బాధ్యతలను అప్పగించారు. ఇది పౌరసేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని ఒత్తిడి  పెరగడంతో దరఖాస్తుల పరిశీలన, సమస్యల  పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్‌, జోనల్‌, కేంద్ర కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ పోస్టులు సుమారు  320కి పైగా కాళీ ఉన్నాయి. ప్రణాళికా విభాగంలో 24 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. సర్కిల్‌కు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని గతంలో నిర్ణయించినప్పటికీ, ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పారిశుధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో వందల సంఖ్యలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల క్రితం కొత్త ఇంజనీర్లువచ్చినా, ఎస్‌ఆర్‌డీపీ, రెండు పడకల ఇళ్లు, నిర్వహణ పనులకు సరిపడా ఉద్యోగులు లేరు. దీంతో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు న్యాక్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌లో సైట్‌ సూపర్‌వైజర్లుగా ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల సేవలు వినియోగించుకుంటున్నారు. 

ఫ  వాటర్‌బోర్డులో ఔట్‌ సోర్సింగ్‌ సేవలే.. 

వాటర్‌బోర్డులో అన్ని విభాగాలు కలిపి 6,109 పోస్టులకు గాను 5,021 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇందులో వెయ్యి మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందే. పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక్కో అధికారి రెండేసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రారంభంలో వాటర్‌ బోర్డు సేవలు కోర్‌ సిటీ వరకే పరిమితం కాగా, తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధికి విస్తరించారు. ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని మునిసిపాలిటీలు, 180కి పైగా గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది. బోర్డు సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నా.. ఈ మేరకు ఉద్యోగాల మంజూరు లేదు. ఉన్న ఉద్యోగులతోనే నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలతో వరద సమస్య తలెత్తగా, అప్పటికప్పుడు 700 మందిని తాత్కలికంగా ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెట్టారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీల భర్తీకోసం ఇటీవల టీఎస్సీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. 

ఫ  పదిమంది చేయాల్సిన పనులు.. 

హెచ్‌ఎండీఏలో ప్రతీ నెలా ఉద్యోగులు రిటైర్డ్‌ అవుతున్నారు. వారి స్థానంలో ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయడం లేదు. దీంతో పది మంది చేయాల్సిన పనులు నలుగురు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులు సగానికి తగ్గడం, ఉన్న వారిలో కొందరు సెలవులపై వెళ్లడంతో హెచ్‌ఎండీఏ వెలవెలబోతోంది. ఇక హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో ఉద్యోగులు మూడో వంతుకు పడిపోయారు. ఈ విభాగంలో  110మంది అధికారులు, ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, 30 మంది ఉన్నారు. పలు ఏపీఓ, జేపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిపాలన, ఆకౌంట్స్‌ విభాగాలలో 334 పోస్టులకుగాను 140 మంది మాత్రమే ఉన్నారు. సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఆరింటికి ఆరు ఖాళీగా ఉన్నాయి. సీనియర్‌ స్టెనో పోస్టులు తొమ్మిదికి తొమ్మిది ఖాళీ ఉండగా, టైపిస్టు పోస్టులు 16కు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకున్నారు. జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 15కు అన్ని ఖాళీగా ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 45 ఉండగా, 13 మంది ఉన్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు 33 మంది అవసరం కాగా, ఆరుగురే ఉన్నారు. అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగంలో 37 పోస్టులకు, 17 ఖాళీగా ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌,  పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డెవలప్‌మెంట్‌ విభాగంలో 110 పోస్టులకు 60 ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగంలో డీఈలు, ఏఈఈలు, ఏఈల కొరత తీవ్రంగా ఉంది. 

ఫ  వేధిస్తున్న టీచర్ల కొరత..

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 508 ప్రాథమిక, 181 ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు న్నాయి. మొత్తం 82,653 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 4,600 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్‌ పండిట్లు పనిచేస్తున్నారు. పాఠశాలల్లో నాలుగేళ్ల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ ఆయా ఖాళీలను భర్తీ చేయడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. ఇక జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జిల పాలన సాగుతోంది. 12 డిప్యూటీ ఈఓ పోస్టుల్లో అన్ని ఖాళీగానే ఉన్నాయి. దీంతో సీని యర్‌ గెజిటెడ్‌ హెడ్మాస్టర్లతోనే పనులు చేయిస్తున్నారు. 24 డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ (డీఐఓఎస్‌) 24 పోస్టుల్లో 23 ఖాళీగా ఉన్నాయి. 10 గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ పోస్టుల్లో పది ఖాళీగా, 171 ప్రధానోపాధ్యాయుల్లో 86 ఖాళీగా ఉన్నాయి.

ఫ  వైద్యశాఖ.. ఇన్‌చార్జిలమయం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. యూపీహెచ్‌సీ నుంచి డీఎంఅండ్‌ హెచ్‌ఓలో పాలన వరకు అధికారులు, సిబ్బంది లేక పాలన కుంటుపడుతోంది. ఖాళీ పోస్టుల్లో ఇతర అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి నియామకాలు చేపట్టడం లేదు.  

ఫ  కాంట్రాక్ట్‌ పద్ధతిలో డాక్టర్లు

డీఎంఅండ్‌హెచ్‌వో పరిధిలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండ గా, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారు. కొన్ని చోట్ల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమీప మెడికల్‌ ఆఫీసర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టులు లేరు. రోజూ పది నుంచి ఇరవై ప్రసవాలు జరిగే ప్రసూతీ కేంద్రాల్లో పిల్లల వైద్యులు అసలే లేరు. మలేరియాను గుర్తించే ల్యాబ్‌ టెక్నిషయన్ల కొరత ఉంది. జిల్లా వైద్య శాఖ పరిధిలో 107 మంది హెల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, ఎక్కువ మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారు.

Advertisement
Advertisement