Apr 21 2021 @ 12:53PM

భార్గవ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. దయచేసి డిలీట్‌ చేయండి: ఓ మై గాడ్‌ నిత్య

మైనర్‌ బాలిక అత్యాచార కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి..దిశా యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. భార్గవ్‌, మైనర్‌ బాలిక అత్యాచార కేసులో అరెస్ట్‌ అయ్యాడనే వార్తలు బయటకు రాగానే చాలా మంది నెటిజన్స్‌, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు ఓ మై గాడ్‌ ఫేం నిత్య ఫొటోలను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో భార్గవ్‌, నిత్య కలిసి య య ఓ మై గాడ్‌ అనే వీడియోలను చేసింది. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. ఇప్పుడు భార్గవ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఓ మై గాడ్‌ నిత్య పేరు వినపడింది. తన పేరు యూ ట్యూబ్స్‌లో, నెట్టింట హల్‌ చల్‌ చేయడంపై నిత్య స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. భార్గవ్‌ కేసుకి, తనకు ఎలాంటి సంబంధం లేదని, తనతో మాట్లాడి ఏడాది దాటిందని నిత్య సదరు వీడియోలో చెప్పింది. 

"నేను ఎందుకు మీ ముందుకు వచ్చానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ రేప్‌ కేసు విషయంలో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో, నాకు కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్‌ నాకు మెసేజ్‌ చేశారు. నాకైతే ఏ విషయం తెలియదు. నాకు ఏ సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేశాను. భార్గవ్‌ను కలిసి ఏడాది దాటింది. అయితే ఈ గొడవలో చాలా మంది మీమ్స్‌ చేసేవాళ్లు, ట్రోలర్స్‌, యూట్యూబర్స్‌ నా పేరు, ఫొటోలను వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారు. అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను. దయచేసి నా ఫొటోలను, వీడియోలను డిలీట్‌ చేయండి. రెండు రోజుల్లో అసలు నిజాలు తెలుస్తాయి" అంటూ నిత్య వీడియోలో తెలిపింది. ఈ వీడియోను నిత్య తల్లితో కలిసి విడుదల చేసింది.