నడిరోడ్డుపై నల్ల బజారు

ABN , First Publish Date - 2021-12-06T05:48:58+05:30 IST

తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సుమారు 50 కిలోమీటర్ల మేర అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్డును అనుకుని చిన్న షెడ్డు వేసి మరుగుకోసం టార్ఫాలిన్‌ను అడ్డంగా ఏర్పాటుచేసిన డెన్లు అడుగడుగునా కనిపిస్తుంటాయి. కత్తిపూడి కేంద్రంగా సాగే ఈ అక్రమ వ్యాపారం ఇప్పుడు తుని నియోజకవర్గానికి చేరింది

నడిరోడ్డుపై నల్ల బజారు
జాతీయ రహదారిపై ఎర్రకోనేరు వద్ద ఏర్పాటుచేసిన అక్రమ వ్యాపార కేంద్రం

  • తోటల మాటున చీకటి వ్యాపారం
  • తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జాతీయ రహదారిపై అడుగడుగునా అక్రమాలు
  • నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు
  • దర్జాగా ఆయిల్‌, తారు, ఐరన వ్యాపారాలు

తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సుమారు 50 కిలోమీటర్ల మేర అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్డును అనుకుని చిన్న షెడ్డు వేసి మరుగుకోసం టార్ఫాలిన్‌ను అడ్డంగా ఏర్పాటుచేసిన డెన్లు అడుగడుగునా కనిపిస్తుంటాయి. కత్తిపూడి కేంద్రంగా సాగే ఈ అక్రమ వ్యాపారం ఇప్పుడు తుని నియోజకవర్గానికి చేరింది. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సుమారు 15చోట్ల ఇటువంటి అక్రమ వ్యాపార  కేంద్రాలను ఏర్పాటుచేశారు. నాయకులకు, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ప్రతీనెలా మామూళ్లు చేరడంతో వారు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో  వ్యాపారులు మరింత రెచ్చిపోయి బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు. 

తుని, డిసెంబరు 5: ఒకప్పుడు జాతీయ రహదారిపై కత్తిపూడిలోనే ఈ అక్రమ వ్యాపారాలు సాగించేవారు. అయితే వ్యాపారస్తులు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అడుగడుగునా కేంద్రాలను పెట్టుకుని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. లారీ డ్రైవర్లకు, అక్రమార్కులకు మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ముందుగా ఏర్పాటుచేసుకున్న కేంద్రాల వద్ద రాత్రి సమయంలో దీపం బుడ్డి వెలిగించి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ఆయిల్‌, తారు తీసే కేంద్రమని తెలుస్తోంది. లారీని పక్కన పెట్టి అందులో ఉన్న ఆయిల్‌ను అమ్మేందుకు బేరం మాట్లాడుకుంటారు. బంకుల్లో ఉన్న ధన కంటే 20 నుంచి 30 రూపాయల తక్కువకు ఆయిల్‌ ఇచ్చేందుకు వ్యాపారస్తులు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ లారీని వారు టార్పాలిన్‌తో కప్పి ఉంచే ప్రాంతానికి తీసుకెళ్లి అందులో ఆయిల్‌ను తీసేస్తారు. రాత్రిళ్లు ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

తారు స్థానంలో నల్లరాళ్లు, బూడిద...

అలాగే తారు ట్యాంకర్ల డ్రైవర్లతో కూడా అక్రమార్కులు చేతులు కలుపుతారు. దీపం బుడ్డి కనిపిస్తే చాలు డ్రైవర్ల జేబు నిండినట్టే. మోటారు సహాయంతో ట్యాంకర్ల నుంచి తారును బయటకు తీసేస్తారు. రోడ్లు వేసేందుకు ఉపయోగించేందుకు నల్ల చిప్స్‌, బుడిదను ట్యాంకర్లలో వేసేస్తారు. ఎంత మోతాదు తీశారో అంతే బుడిదను వేయడంతో ట్యాంకర్లలో తారు బరువు తేడా రాకుండా ఉంటుంది. 

ఐరన, సిమెంటు కూడా...

విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే ఐరన లోడు లారీలను కూడా అక్రమార్కులు వదలట్లేదు. లారీని చీకట్లో మామిడి తోటల్లోకి తీసుకెళ్తారు. ఇనుప ఊచల కట్టల నుంచి ఒక్కో ఊచ చొప్పున అందులోంచి తీసేస్తారు. ఎన్ని ఊచలు తీశారో దాని బరువుకు సరిపడా లారీ కింది భాగంలో పెద్ద నల్లరాళ్లను సంచుల్లో మూటకట్టి పెట్టేస్తారు. ఇలా అక్రమంగా కొనుగోలు చేసిన తారు, ఆయిల్‌, ఇనుమును అవసరమైన వారికి మార్కెట్‌ ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. ఇంత బహిరంగంగా వ్యాపారం జరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-12-06T05:48:58+05:30 IST